షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉద్యోగ రిజర్వేషన్లు 100% చెల్లనేరవు : సుప్రీం

by Shamantha N |
షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉద్యోగ రిజర్వేషన్లు 100% చెల్లనేరవు : సుప్రీం
X

దిశ, న్యూస్ బ్యూరో :

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు సహా ఇతర ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లను గిరిజనులకే (ఎస్టీ) కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000వ సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో చెల్లదని, ఆ ప్రకారం జరిగిన పోస్టుల భర్తీ రాజ్యాంగ సమ్మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటికే ఉద్యోగాల భర్తీ జరిగినా ఆ పోస్టుల్లో చేరిన ఉద్యోగులకు దీంతో సంబంధం లేదు కాబట్టి వారి ఉద్యోగాలు యధావిధిగా కొనసాగాలని ఒక ప్రత్యేక అంశంగా సుప్రీంకోర్టు భావించిందని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపైన తెలంగాణ ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలను ఎస్టీలకే కేటాయించే విధానానికి స్వస్తి పలకాలని, మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000వ సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో నెం. 3ను సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. గతంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 100% రిజర్వేషన్లు ఎస్టీలకు చెల్లవని చెప్పినా.. చట్టాన్ని సవరించి జీవో జారీ చేసి ఇప్పటివరకు విచారణలో ఉన్నందున ఖర్చుల నిమిత్తం ఈ రెండు రాష్ట్రాలు తలా రెండున్నర లక్షల రూపాయల చొప్పున సుప్రీంకోర్టుకు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలను ఎస్టీలకే కట్టబెడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత ఆ పిటిషన్‌ను 1998లో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 1997 నాటి ‘ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ 1997’కు సవరణలు చేసి 2000వ సంవత్సరంలో జీవో నెం. 3ను తీసుకొచ్చింది. చట్టానికి సవరణలు చేసినా రాజ్యాంగ నిబంధనలకు 100% రిజర్వేషన్ విధానం విరుద్ధమని, అది చెల్లనేరదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందిరా సహానీ కేసులో మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని స్పష్టత ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాత్రం 100% రిజర్వేషన్లను కల్పించిందని ధర్మాసనం గుర్తుచేసింది.

వాస్తవానికి 1986లోనే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిందని, ఆ తర్వాత 1997 నాటి చట్టానికి సవరణలు చేసి మరోసారి ఉల్లంఘించిందని గుర్తుచేసిన ధర్మాసనం.. ఇప్పుడు స్పష్టమైన తీర్పును వెలువరించినందున ఇకపై తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇలాంటి చట్ట సవరణలు చేసి రిజర్వేషన్లను 50% మించి కొనసాగించే విధానానికి పాల్పడితే 1986 నుంచి జరిగిన అపాయింట్‌మెంట్లన్నింటినీ రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ కేసుకు (2000 సంవత్సరం జీవో నెం. 3) సంబంధించి మాత్రమే విచారణ జరుగుతున్నందున అప్పుడు భర్తీ అయిన ఉద్యోగాలను యధావిధిగా ఉంచుతున్నామని, ఉద్యోగంలో చేరినవారికి ఈ ఉల్లంఘనలతో ఎలాంటి సంబంధం లేనందున ఆ ఉద్యోగాల్లో కొనసాగవచ్చన్న మినహాయింపును ఇస్తున్నామని స్పష్టం చేసింది. కానీ మరోసారి ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

Tags: Tribunal, Reservations, ST, Supreme court, Telangana, AP

Advertisement

Next Story

Most Viewed