వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం!

by Shyam |   ( Updated:2020-07-10 04:25:36.0  )
వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020 వెబ్‌నార్ సమావేశంలో పాల్గొన్న ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా కోలుకుంటున్నందున డిమాండ్‌ను పెంచడానికి ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఉద్దీపనను ప్రకటించిందని, ఇవి డిమాండ్‌ను పునరుద్ధరిస్తాయని, అయితే, దీన్ని మరింత పెంచేందుకు భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించడమే కాకుండా ఆర్థిక చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. యూరప్ వంటి దేశాల్లో ప్రతికూల వడ్డీరేట్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గణనీయమైన చర్యలు తీసుకుంటోంది. జీడీపీతో పోలిస్తే రుణ శాతం ఇతర దేశాల కంటే మన వద్దే తక్కువగా ఉన్నట్టు సంజీవ్ ప్రస్తావించారు. లాక్‌డౌన్ ఉన్న కాలంలో డిమాండ్ పెంచడానికి ప్రయత్నించినప్పటికీ పెద్ద ప్రయోజనాలు కలగవని, ఈ కారణంగానే దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంజీవ్ సన్యాల్ వివరించారు. ఇదివరకు కార్మికులు, వ్యవసాయం, సరఫరా వ్యవస్థల కోసం ప్రభుత్వం సంస్కరణలు వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ, ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వినియోగదారుల దృష్టికోణం మారింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని డిమాండ్ పుంజుకునేలా అవసరమైన విధానాలను ప్రభుత్వం రూపొందించనున్నట్టు సంజీవ్ సన్యాల్ చెప్పారు.

Advertisement

Next Story