కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ముందుకొచ్చిన శామ్‌సంగ్, ఎల్‌జీ!

by Harish |
కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ముందుకొచ్చిన శామ్‌సంగ్, ఎల్‌జీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు బాసటగా నిలుస్తామని ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు శామ్‌సంగ్, ఎల్‌జీలు ప్రకటించాయి. సర్జన్ గౌన్‌లు, మాస్కులు, గ్లోవ్స్, రిఫ్రిజిరేటర్లు, వాటర్ ప్యూరిఫయర్ వంటి ఉత్పత్తులను, రక్షణ పరికరాలను ఆసుపత్రులకు అందిస్తామని ఈ రెండు కంపెనీలు హామీ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, రోజూవారి కూలీలకు పది లక్షల మందికి అవసరమైన భోజనాన్ని అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎల్‌జీ ఎలక్ట్రానిక్ సంస్థ మంగళవారం ప్రకటించింది.

ఎల్‌జీ కంపెనీ ఇండియాలోని సుమారు 50 రాష్ట్ర, జిల్లా స్థాయి ఆసుపత్రులకు ఐసోలేషన్ వార్డులకు వాటర్ ప్యూరిఫయర్, ఎయిర్ కండిషనర్లు, రీఫ్రిజిరేటర్లు, టీవీ వంటి ఉత్పత్తులను విరాళంగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.

ఇక, శామ్‌సంగ్ ఇండియా ఆసుపత్రులకు అవసరమైన వస్తు సామాగ్రిని అందించనుంది. వీటిలో సర్జన్ గౌన్, మాస్కులు, గ్లౌజులు, కంటి సంబంధ దుస్తులు, హెడ్ క్యాప్‌లు, షూ కవర్‌లు ఉన్నాయి. అలాగే, వైద్య సదుపాయాల కోసమ్మ్ ఎయిర్ ప్యూరిఫయర్లతో పాటు ఆసుపత్రులు, ఇతర సౌకర్యాల విధుల్లో ఉండే అధికారులకు ఇన్‌ఫ్రా హెడ్ థర్మామీటర్లను అందించనుంది.

శామ్‌సంగ్ సంస్థ తమ తయారీ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు వండిన ఆహారాన్ని అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. శామ్‌సంగ్ సంస్థ కష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలబడుతుందని, మా సంస్థ బృందాలు ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి అవసరమైన, సమర్థవంతమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని వెల్లడించింది.

Tags: Covid-19, Samsung, LG, Preventive Kits, Electronic Products

Advertisement

Next Story

Most Viewed