జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ.. కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-04-20 10:55:52.0  )
జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ.. కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ మనుగడ రెండూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించాలని, లాక్‌డౌన్ చివరి అంశంగా ఎంచుకోవాలని సూచించారు. కేసుల కట్టడికి మైక్రో కంటైన్‌మెంట్ జోన్లపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ప్రజలూ లాక్‌డౌన్ విధించకుండా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని తెలిపారు. ప్రజలు సక్రమంగా కరోనా నిబంధనలు పాటిస్తే ఆంక్షలు, లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్ కండీషన్లను ప్రకటించాల్సిన అవసరమే రాదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ ఉధృతమైన తరుణంలో ప్రధానమంత్రి మోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు.

వలసకార్మికులకు భరోసానివ్వాలి

వలస కార్మికులు ఎక్కడివారక్కడే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు భరోసానివ్వాలని ప్రధాని తెలిపారు. గతేడాది తరహాలో మళ్లీ సొంతూళ్లకు వెళ్లవలసిన అవసరం లేదని వారిలో విశ్వాసం నింపాలని సూచించారు. అందరికీ టీకా వేస్తామని తెలపాలని అన్నారు. నిబంధనలపాలనతో కరోనాను జయించగలమన్న ధైర్యాన్ని నింపాలని చెప్పారు.

యువత కమిటీలుగా ఏర్పడాలి

ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించి మహమ్మారిని పారద్రోలవచ్చునని మోడీ అన్నారు. ఇందుకు ప్రభుత్వాలకు యువత సహకరించాలని కోరారు. ఎక్కడివారక్కడే యువత కమిటీలుగా ఏర్పడి కరోనా నిబంధనలు సరిగ్గా అమలవ్వడానికి దోహదపడాలని సూచించారు. బాలలూ కరోనాపై పోరులో కీలకపాత్ర పోషించారని, ఇకపైనా పోషించాలని అన్నారు. కుటుంబసభ్యుల్లో ఎవరూ అడుగుబయటపెట్టకుండా మారం చేయాలని తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి గడపదాటాలని, దాటినా కచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పారు.

ఆ నిర్ణయంతో పరిస్థితులు మెరుగు

ఇటీవలే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నదని, 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా వేయాలని ప్రకటించామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రస్తుత సంకట పరిస్థితులు మెరుగవుతాయని విశ్వాసాన్ని ప్రకటించారు. మనదేశంలో అతిపెద్ద ఫార్మా పరిశ్రమ ఉండటం మన అదృష్టమని అన్నారు. గతేడాదిలో పరిస్థితులు ఇంతకంటే తీవ్రమని, అప్పుడు పీపీఈ కిట్లు లేవని, వైరస్ లక్షణాలూ, నియంత్రణ చర్యలపైనా అవగాహన అంతంతేనని తెలిపారు. అయితే, ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని, సరిపడా ఆక్సిజన్ అందించడానికి కృషి చేస్తున్నామని వివరించారు.

మీ కుటుంబంలో ఒకడిగా మీతోనే ఉన్నా..

‘కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అంతా సద్దుమణుగుతున్నట్టే అనిపించింది. అసెంబ్లీ ఎన్నికలూ మొదలయ్యాయి. కానీ, ఉన్నట్టుండి మళ్లీ తుఫాన్‌ల సెకండ్ వేవ్ దూసుకువచ్చింది. ఈ విజృంభణలో ఎన్నో కుటుంబాలు తమ ప్రియతములను కోల్పోయాయి. వారందరికీ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సంకట పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యుడిగా మీతోనే ఉన్నాను. ఈ యుద్ధం సుదీర్ఘమైనది. కానీ, మన ఐకమత్యం, ధైర్యసాహసాలు కచ్చితంగా విజయాన్ని అందిస్తాయి. గతేడాది, ఇప్పుడూ ప్రజలు అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు’ అని ప్రధాని తెలిపారు. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తుచేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story