- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు జీతాల టెన్షన్
దిశ, న్యూస్ బ్యూరో: చిరుద్యోగులు చిగురుటాకులా వణుకుతున్నారు.. ఎందుకో తెలుసా? పెన్షన్‌దారులు టెన్షన్ పడుతున్నారు.. ఎందుకో తెలుసా? వ్యాపార, వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? లాక్‌డౌన్ కాలంలో కౌంట్‌డౌన్ మొదలైంది.. ఎందుకో తెలుసా? అన్నింటికీ ఒకటే సమాధానం.. అది ఏప్రిల్ ఒకటి. కరోనా కరాళనృత్యానికి సకలం కకావికలమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్నిరంగాలూ లాక్‌డౌన్. సమస్తం షట్‌డౌన్. మాయదారి మహమ్మారి కరోనా సృష్టించిన విపరిణామాలపై ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది…
ఏప్రిల్ ఒకటో తారీఖు.. ఇంకా మూడురోజులే. ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే రోజు అది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళా బీడీ కార్మికులు.. ఇలా లక్షలాది మంది ఆసరా పింఛన్ల కోసం ఆశగా చూసే రోెజు అది. అంతేనా.. ప్రైవేట్ కంపెనీలు సైతం బిజినెస్ జరగక, ఆదాయం రాక తమ స్టాఫ్‌కు ఏప్రిల్ ఒకటిన వేతనాలు ఎలా చెల్లించాలో అర్థం కాక సతమతమవుతున్నాయి. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. ఒక మోస్తరు ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులకు జీతాలు అందుతాయో లేదోననే భయం ఉంది. 21 రోజుల లాక్‌డౌన్ కాలానికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఆర్థిక భారాన్ని ఎన్ని కంపెనీలు మోస్తాయో తెలియని అగమ్యగోచర పరిస్థితి నెలకొంది. మార్చి నెల కాలానికి జీతం వస్తుందేమోగానీ ఏప్రిల్ నుంచి నెట్టుకురావడం ప్రైవేటు చిరుద్యోగులకు ఊహించని పరిణామమే.
ప్రతీనెలా ప్రభుత్వానికి కేంద్ర పన్నుల వాటా, వ్యాట్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, వాహనాల పన్ను.. ఇలా రకరకాల రూపాల్లో సుమారు రూ. 9000 కోట్ల మేరకు వసూలవుతాయి. ఇందులో కేంద్రం పన్నుల వాటా మినహాయిస్తే మిగిలిన ఆదాయం రూ. 7,000 కోట్లు ఉంటుంది. కానీ, కరోనా కారణంగా ఈసారి మూడవ వంతు (సుమారు రూ. 3,000 కోట్లు) కూడా వసూలు కాలేదు. వ్యాపారాలే కుదేలుకావడంతో ఆ వ్యాపారులు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. వాహనాల పన్ను ఆగిపోయింది. ప్రతీ నెలా సగటున రెండు వేల కోట్లు మద్యం ద్వారానే వస్తుంది. లిక్కర్ దుకాణాలు మూతపడడంతో ఇప్పుడు అదీ ‘మద్యం’తరంగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ స్థంభించిపోయాయి. అందుకే ఉద్యోగుల్లో, ఆసరా పింఛను లబ్ధిదారుల్లో ఇంతటి ఆందోళన.
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇప్పుడు 20% మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులే విధుల్లో ఉంటున్నారు. వివిధ విభాగాల ఉద్యోగుల అటెండెన్స్, అడ్వాన్సు చెల్లింపు లాంటి లెక్కలు వేయడానికి కూడా సరిపోయినంత సిబ్బంది విధుల్లో లేరు. జీతాల లెక్కలను ప్రభుత్వం సిద్ధం చేసిందా అనే సందేహమూ ఉంది. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం జీతాలు, ఆసరా పింఛన్లకు అవసరమైనంత డబ్బు ఉండకపోతుందా అనే ధీమా ఉన్నప్పటికీ ఆర్థిక మాంద్యంతో గతేడాది కాలంగా రాష్ట్ర పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో జీతం రావడం అనుమానమే అనే సందేహమూ ఉంది.
ప్రతీ నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, ఆసరా పింఛన్లకు సుమారు రూ. 3,500 కోట్లు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వానికి మార్చి నెలలో వచ్చిన పన్నుల ఆదాయం మాత్రం రూ. 3,000 కోట్లు కూడా లేదు. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం మార్చి నెల జీతాలను ఏప్రిల్ 1వ తేదీకల్లా ఇవ్వడానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ కరోనా అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సి వస్తే చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 15 వరకూ ఉంటున్నందున అప్పటిదాకా వ్యాపారమూ ఉండదు, పన్నులూ వసూలు కావు కాబట్టి ఆ నెల జీతాలను మే నెలలో చెల్లించడానికి చాలా ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ ఇదే లాక్‌డౌన్ ఇంకొంత కాలం కొనసాగితే ఉద్యోగుల జీతాలే కాదు సంక్షేమ పథకాల అమలు కూడా ఇబ్బందుల్లో పడక తప్పదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణకు మాత్రమే కాక ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా తప్పదని, ఒక సంక్షోభ కాలమని అన్నారు.
ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరి నెలలో (మార్చి మాసం) ఆ ఆర్థిక సంవత్సరానికి వేసుకున్న అంచనాల లక్ష్యాన్ని చేరడానికి పెండింగ్ బకాయిలతోపాటు వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకోడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానీ, ఈసారి కరోనా కారణంగా అది పూర్తిగా ఆగిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం సుమారు రూ. 45 వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పన్నుల ద్వారా రాష్ట్రానికి సమకూరితే అందులో దాదాపు పదిశాతం కంటే ఎక్కువ (రూ. 5,200 కోట్లు) ఒక్క మార్చి నెలలోనే సమకూరింది. కానీ, ఈసారి మాత్రం అది అందులో సగానికే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వ్యాపారం లేని కారణంగా ఫిబ్రవరి నెలలోని జీఎస్టీ రిటర్న్‌లను (ఆ నెలలో పొందిన్ ఇండెంట్, వ్యాపారం ద్వారా ఇచ్చిన ఇన్‌వాయిస్ తదితరాలు) వ్యాపారులు మార్చి 20వ తేదీకల్లా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి అలాంటి చెల్లింపులేవీ లేవు.
రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో మెజారిటీ వ్యాపారులు చెల్లించలేదు. కొన్ని పెద్ద కంపెనీలు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తాయి. ఇప్పుడు లాక్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుందోననే అనుమానంతో డబ్బులను చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వమే జీఎస్టీ రిటర్న్‌ల చెల్లింపును మూడు నెలలపాటు వాయిదా వేసింది. దీంతో మరో మూడు నెలల వరకూ జీఎస్టీ వసూళ్ళు ఉండవు. దాంతో ప్రభుత్వ ఆదాయవనరుల్లో సింహభాగం నిలిచిపోయినట్లే. అయినప్పటికీ ఆయా సర్కిళ్ళ అధికారులపై మాత్రం వీలైనంత వరకు జీఎస్టీ చెల్లింపులను రాబట్టాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులను జీఎస్టీ అధికారులు గట్టిగా డిమాండ్ చేయలేరుగాబట్టి వారికి అర్థం చేయించి ఎంతవరకు వీలైతే అంత మాత్రమే వసూలు చేయడానికి పరిమితం కానున్నారు.
రాష్ట్ర స్వీయ ఆదాయ వనరులపైనే ఆధారపడుతున్నాంగానీ కేంద్రం దయాదాక్షిణాల్యపై కాదని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయ వనరులన్నీ దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థను ఎలా నెట్టుకొస్తారనేది కీలకంగా మారింది. ఏది ఆగినా సంక్షేమ పథకాలు, సాగునీటి అవసరాలకు మాత్రం నిధుల కొరత రానీయమని చెప్పారు. కానీ, ఊహించని కరోనా కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలు కావడంతో వేతనాలు, సంక్షేమ పథకాలు తదితరాలపై ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రైవేటు ఉద్యోగాలకు కోత:
నగరంలో అనేక స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. కానీ, ఇప్పుడు లాక్‌డౌన్ పరిస్థితితో అయోమయంలో పడ్డాయి. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరిన సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సైట్ సర్వీస్ టెక్నీషియన్లు లాంటివారు ప్రైవేటు హాస్టళ్ళలో ఉంటూ పనిచేస్తున్నారు. కానీ, లాక్‌డౌన్ పరిస్థితో నాలుగు రోజుల క్రితం చాలా ప్రైవేటు హాస్టళ్ళు మూతపడడంతో స్వస్థలాలకు వెళ్ళిపోయారు. తిరిగి ఎప్పుడొస్తారో, వచ్చేటప్పటికి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియడంలేదు. అలాంటివారు నగరంలో వేల సంఖ్యలోనే ఉన్నారు. మరికొన్ని కంపెనీల్లో కొత్తగా చేరినవారికి పనితీరును బట్టి ఉద్యోగాలు వచ్చాయి. కానీ వారి టాలెంట్‌ను రుజువు చేసుకునేలోపే లాక్‌డౌన్ రావడంతో ఉద్యోగానికి ముప్పు వచ్చింది. ఎక్కువగా కార్ల షోరూంలు, ఇన్సూరెన్సు కంపెనీలు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, బ్యాంకింగ్ రంగం తదితరాల్లోని చిరుద్యోగులకు చిక్కులేర్పడ్డాయి. కొన్ని సూపర్ మార్కెట్లలో ఇప్పటికే ఫ్లోర్ మేనేజర్, టీమ్ లీడర్ల ఉద్యోగాలు పోయాయి. నోట్ల రద్దు ఒక ఉపద్రవాన్ని తీసుకొచ్చి నిరుద్యోగాన్ని పెంచితే ఇప్పుడు కరోనా వంతయింది. ఈ ఒక్క నెలకు కాస్త ధైర్యం ఉన్నట్లు కనిపించినా మున్ముందు మాత్రం వారికి కొలువు దొరకడం గగనమే అనే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రస్తుత లాక్‌డౌన్ మరికొన్ని నెలలపాటు కొనసాగితే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో యువత రోడ్డుపై పడతారు.
Tags: Telangana, Employees, Salaries, Corona, Asara Pension, Payments, GST Collection