రష్యా బాటలోనే దక్షిణ కొరియా.. నిర్లక్ష్యంతో పెరిగిన కరోనా కేసులు

by vinod kumar |
రష్యా బాటలోనే దక్షిణ కొరియా.. నిర్లక్ష్యంతో పెరిగిన కరోనా కేసులు
X

సియోల్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న కొత్తలో అప్రమత్తమైన దేశాలే తర్వాత నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాయి. రష్యా ఇప్పటికే కరోనాకు కేంద్ర బిందువుగా మారగా.. తాజగా చైనా పక్కనే ఉన్న దక్షిణ కొరియాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ విజృంభించిన కొత్తలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన సౌత్ కొరియా.. కేసులు తగ్గడంతో లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేసింది. దేశ రాజధాని సియోల్‌లో నైట్ క్లబ్స్‌కు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. సియోల్ శివార్లలోని ఒక నైట్ క్లబ్‌కు వచ్చిన కరోనా పేషంట్ వల్ల ఏకంగా 34 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అతడిని గాలించి ప్రైమరీ, సెకండరీ పేషంట్లను గుర్తించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్నాళ్లు కట్టడిలో ఉన్న కరోనా కేసులు నైట్ క్లబ్స్ తెరవడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో సియోల్ లోని 2100 పైగా ఉన్న క్లబ్స్‌ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా నైట్ క్లబ్స్‌కు ఒకే రోజు 8 వేల మంది వినియోగదారులు వచ్చారని అంచనా వేస్తున్నారు. చైనా సరిహద్దు దేశమైన రష్యా చేసిన తప్పునే దక్షిణ కొరియా చేసిందని.. నిర్లక్ష్యమే కరోనా కేసులు పెరగడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ద.కొరియా ప్రభుత్వం వెంటనే నైట్ క్లబ్స్ మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భౌతిక దూరం, లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మరో సారి స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed