- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఛీ’ కొడుతున్న జనం
దిశ, తెలంగాణ బ్యూరో: వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శలు, ఓదార్పు యాత్రలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖం మీదనే ప్రశ్నల వర్షం కురిపించి నిలదీస్తున్నారు. సమాధానం చెప్పుకోలేక వెనుదిరగాల్సి వస్తోంది. వంద డివిజన్లలో గెలిచామని గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి. ఐదు రోజులుగా వరద నీటిలో చిక్కుకుంటే పలకరించిన నాథుడే లేడని, ఓట్ల సమయంలో కనిపించి మళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కనిపిస్తున్నారా అనే ప్రశ్నలకు నేతల నుంచి సమాధానం కరువు.
పరిష్కారానికి నోచని సమస్యలు
వర్షాలు, వరదలు వచ్చి ఐదారు రోజులవుతున్నా ఒక్కరైనా వచ్చి తమ కష్టాల గురించి పట్టించుకోలేదని, పరిష్కరించలేదని, తిండీ తిప్పలు లేకుండా ఉంటే ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కూడా లేవనేదే వారందరి ఆవేదన. కింది అంతస్తు వరకు నీళ్లలో మునిగిపోతే మిద్దెలమీద, రెండో అంతస్తులో కాలం వెళ్లదీస్తున్న అనేక కాలనీల్లోని ప్రజలకు తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, బాధలు చెప్పుకోడానికి ఫోన్లు లేవు, సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి మార్గం లేదు, కట్టుబట్టలతో మిగిలిపోయిన వీరు దినదిన గండం తరహాలో బతుకుతున్నారు. ఓట్ల సమయంలో ఇల్లిల్లూ, గల్లీగల్లీ తిరిగే నేతలంతా ఇప్పుడు ఎక్కడకు పోయారన్నదే వారి ప్రశ్న. ఓటు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్ మొదలు ఎమ్మెల్యే వరకు ఎవ్వరికీ తమ బాధలు ఎందుకు పట్టడంలేదన్నదే వారి ఆవేదన. అందుకే ఇప్పుడు పరామర్శలకు వస్తున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్..కేటీఆర్ డౌన్‌డౌన్..
నాలుగు రోజుల క్రితం బైరామల్‌గూడలో స్థానికులు కేసీఆర్ డౌన్‌డౌన్, కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంగళవారం వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను పలకరిద్దామని బుధవారం వెళ్లిన కేటీఆర్‌కు ఇది ఊహించని పరాభవం. మంత్రి పర్యటనను అడ్డుకుంటారనేమోననే అనుమానంతో పక్కనే ఉన్న పోలీసులు నినాదాలు చేస్తున్న మహిళలను ముందుకు కదలకుండా నిలిపివేశారు. ఆ తర్వాతి రోజు ఎల్బీనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పుకోలేక వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ప్రజల ఆగ్రహం..
రెండ్రోజుల క్రితం రాంనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రజల కష్టసుఖాల గురించి తెలుసుకోకుండా సైట్ సీయింగ్ చేసినట్లుగా వెళ్లిపోతున్నారేంటి అంటూ నిలదీశారు. వినీ విననట్లుగా సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఇక ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిని మహిళలు గట్టిగానే నిలదీశారు. ఒక దశలో వారి మధ్య వాగ్వాదమే జరిగింది. మహిళలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరకు చేసేదేమీ లేక ఎమ్మెల్యే తాను వచ్చిన బోటులోనే వెళ్లిపోక తప్పలేదు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం స్థానిక కార్పొరేటర్లపై మండిపడ్డారు. ప్రజలకు కష్టకాలంలో అందుబాటులో లేకపోతే ఎందుకు కార్పొరేటర్లుగా పోటీచేశారంటూ ఒకరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది.
మీర్‌పేటలోని మిథిలాపురి కాలనీలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికి ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి వచ్చారు. ఆమె రాక విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు అడ్డంగా కూర్చుని ఆమె పర్యటన అవసరం లేదని నినాదాలు చేశారు. బైక్‌లను, ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి కాన్వాయ్ రాకుండా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని ఒక మేరకు చక్కదిద్దినా మంత్రిని, ఎంపీని మాత్రం ఇలాంటి వీఐపీలు తమకు అవసరం లేదని, ప్రభుత్వం నుంచి సాయం అందుతున్న ఆశ లేదని, మాటల్ని నమ్మే రోజులు పోయాయని ముఖంమీదనే గట్టిగా తేల్చి చెప్పారు. మంత్రి పరాభవంతో తిరిగి వెళ్లిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేకుండా కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో తిరగడం లేదు. కొద్దిమంది మహిళా కార్పొరేటర్లు మాత్రం ప్రజలను కలుస్తూ సీఎం రిలీఫ్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
గోడు చెప్పుకునే మార్గమే లేదు..
సరూర్‌నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రాంతాల్లో స్థానికులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లోనే హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామంటూ మంత్రి కేటీఆర్ చాలా గొప్పగా చెప్పారని, కానీ, ఐదేండ్లయినా పరిస్థితిలో మార్పేమీ రాలేదని దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీ స్థానికుడొకరు ప్రశ్నించారు. మోరీలనే బాగుచేయలేని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో సచివాలయం కట్టుకుంటుందా అని సూటిగానే ప్రశ్నించారు. ఈ ఆరు రోజుల్లో ఎన్నకైన ప్రతినిధులుగానీ, ప్రభుత్వ సిబ్బందిగానీ తమ ప్రాంతానికి రాలేదని, తమ బాధల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలిసిపోతోందన్నారు. సింగరేణి కాలనీలో మంగళవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు కరెంటే లేదని, విద్యుత్ సరఫరాను చక్కదిద్దడానికి ఆరు రోజుల సమయం కావాలా అని ఒక స్థానికుడు ప్రశ్నించారు. ఏఈ, డీఈఈలను సంప్రదిస్తే కనీసం సమాధానమే ఉండటం లేదన్నారు. హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్పందించేవారే లేరన్నారు. మొబైల్‌లో ఛార్జింగ్ ఉన్నంతవరకు నెట్టుకురాగలిగామని, ఇప్పుడు అది కూడా లేదని, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో మార్గమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.