‘RS ప్రవీణ్‌కుమార్ బహుజన గర్జనకు లక్షలాదిగా తరలి రావాలి’

by Shyam |   ( Updated:2021-08-05 21:25:21.0  )
rs-praveen-kumar 1
X

దిశ, నార్కట్‌పల్లి: ఆగస్టు 8న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న బహుజన గర్జనకు నకిరేకల్ నియోజకవర్గం నుండి లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మేడిరాణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో ఆర్థికపరమైన, సామాజిక పరమైన, ఉత్పత్తిలో భాగస్వాములై సంపదను సృష్టిస్తున్న బహుజనులు తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఈ ఉత్పత్తి కులాల జీవన విధానం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆమె అన్నారు. తెలంగాణలో అనాదిగా అనగదొక్కబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం, బహుజన సమాజం రాజ్యాధికారం సాధించడం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరున్నర సంవత్సరాల ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశారన్నారు. బహుజనులను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ బహుజనుల గొంతుకగా ముందుకు వస్తున్నారని, తెలంగాణ యావత్ సమాజమంతా మద్దతుగా నిలవాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో బహుజన నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story