లాక్‌డౌన్ వల్ల జరిగే నష్టమెంత!

by Shyam |
లాక్‌డౌన్ వల్ల జరిగే నష్టమెంత!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే, ఈ నిర్భంధం వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టాలు కలగనున్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలను పరిశీలిద్దాం!

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ వల్ల సుమారు 80 శాతం ఉత్పత్తి తగ్గిపోతుందని కేర్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. దీని ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ రోజుకు రూ. 35,000 నుంచి రూ. 40,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని, మొత్తం రూ. 6.3 నుంచి రూ. 7.2 లక్షల కోట్లని కేర్ రేటింగ్స్ సంస్థ వివరించింది. కేర్ రేటింగ్ ఏజెన్సీ అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ రూ. 140 నుంచి రూ. 150 లక్షల కోట్లు. ఈ గణాంకాల ప్రకారం సెలవులు పోగా 300 పని దినాలు అనుకుంటే, రోజూవారి ఉత్పత్తి రూ. 50 వేల కోట్లు ఉంటుందని, లాక్‌డౌన్ కారణంగా ఈ మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ తెలిపింది.

మూడింత రెండు వంతుల ప్రభావంతో తొలి త్రైమాసికంలో జీడీపీ నష్టం రూ. 4.2 నుంచి రూ. 4.8 లక్షల కోట్లు. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి క్షీణించినట్లైతే ఆ త్రైమాసికంలో వృద్ధి రెట్టింపు అవుతుంది. అయితే, రేటింగ్ సంస్థ మరో సందేహాన్ని వెలిబుచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ 21 రోజుల్లోనే పూర్తయితేనే ఈ నష్టం లెక్కలోకి వస్తుందని, ఒకవేళ పొడిగిస్తే మరింత నష్టాన్ని చూడాల్సి వస్తుందని వివరించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగితే 30 రోజుల నుంచి 60 రోజుల వరకూ లాక్‌డౌన్ తప్పదని అభిప్రాయపడింది.

గతేడాది తొలి త్రైమాసికంలో జీడీ రూ. 53.5 లక్షల కోట్లు ఉండగా, 6 శాతం వృద్ధి నమోదు జరిగింది. ప్రస్తుతం రూ. 4.2 నుంచి రూ. 4.8 లక్షల నష్టంతో ప్రతికూల వృద్ధి నమోదవుతోంది. దీన్ని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్ పది వారాల్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాల్సి ఉంటుంది.

ఫార్మా, చిన్న సూక్ష్మ మధ్య తరహా సంస్థలు కొనసాగినప్పటికీ, రవాణా, పర్యాటకం, హోటల్‌లు కొంత విరామ తర్వాత పనులను ప్రారంభిస్తాయి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే ఉద్యోగాలను పోగొట్టుకున్న వారికి రివర్స్ మైగ్రేషన్ జరగాలి. దీనికోసం కనీసం నెలరోజుల సమయం పడుతుంది. ఈ పరిణామాలతో ఆయా రంగాలు వేగంగా కోలుకోవడానికి ఆటంకం ఏర్పడుతుంది. అదే సమయంలో లాక్‌డౌన్ వల్ల అవసరమైన ఉత్పత్తి పూర్తీగా నిలిచిపోతుంది. అంటే, రైతు ఆదాయం పెరగకపోయినా ఉత్పత్తి నమోదు అవుతుంది.

కరోనా కారణంగా కలిగే అతిపెద్ద ఆందోళన నిరుద్యోగం. ఇప్పటికంటే మరింత తీవ్రమైన సమస్యగా మారనుంది. అనూహ్యంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే అత్యధిక కనిష్ఠంలో ఉన్న నిరుద్యోగ శాతం పెరుగుతుంది. రెట్టింపు స్థాయికి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని రేటింగ్ సంస్థ వివరించింది. కేవలం ఇవి మాత్రమే కాకుండా కరోనా మహమ్మారి వల్ల వాణిజ్య రంగం అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతుందని తెలిపింది. దేశంలో ప్రభుత్వం ప్రకటించినట్టు ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ పూర్తయి సాధారణ స్థితికి వస్తే వృద్ధి 3 శాతానికి పడిపోయే అవకాశముంది. అంతకంటే ఎక్కువ వృద్ధి సాధ్యం కాదని రేటింగ్ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్ రంగం అన్ని రంగాలకు ఇచ్చే రుణాలను పెంచకపోతే వృద్ధి 1.5 శాతం నుంచి 2 శాతం వరకూ తక్కువగా నమోదయ్యే అవకాశముందని రేటింగ్ సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

Tags: coronavirus, Economic loss, economy, Global recession, india

Advertisement

Next Story

Most Viewed