కౌలు రైతుల కన్నీటి సాగు.. అప్పులపాలై బలవన్మరణాలు

by Anukaran |   ( Updated:2021-07-28 23:21:06.0  )
farmer suicides
X

ఇది కౌలురైతుల కన్నీటి గాథ.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్నా అప్పులు మూటకట్టకుంటున్న దుస్థితి. ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం, రైతుబంధు రాకపోవడం, రుణ అర్హత కార్డులు ఇవ్వకపోవడం వారి బలవన్మరణాలకు కారణమవుతున్నది. ఈ ఆరేండ్ల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 4,218 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 81.4 % పత్తి రైతులుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో వరి, మొక్కజొన్న పండించేవారున్నారు. గుర్తింపుకార్డులు లేని కారణంగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడం, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇన్​పుట్​ సబ్సిడీ కూడా భూ యజమానులకే దక్కుతుండటం కౌలు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. సాగు కోసం చేసిన అప్పుల మీద వడ్డీలు పెరిగి వాటిని తీర్చలేక తనువుచాలిస్తున్నారు. రైతుబీమాకు అనర్హులైనందున చనిపోయిన కౌలుదారుల కుటుంబాలు కష్టాల్లో కాలం గడుపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కౌలు రైతుల చావులు సర్కారు లెక్కలకెక్కడం లేదు. రైతు ఆత్మహత్యలపై నివేదిక ఉన్నా.. వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. సర్కారు గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు ఉంటే… వారిలో 15 లక్షల మంది కౌలుదారులే. పంట పెట్టుబడి కోసం తెస్తున్న అప్పులు కౌలు రైతులను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ఏటా నష్టాలు రావడం, తెచ్చిన అప్పులు తీర్చే దారి లేక ఉరికంబాలెక్కుతున్నారు. ఇక రైతులకోసం ఎంతో చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అది నిజం కాదని పరిస్థితి నిరూపిస్తున్నది.

చావుడప్పు

రాష్ట్రంలో కౌలురైతుల ఇంట చావుడప్పు మోగుతున్నది. పండించిన పంటకు గిట్టుబాటు లేక కొందరు, అప్పు పుట్టక ఇంకొందరు, చేసిన అప్పు తీర్చలేక మరికొందరు, ప్రకృతి వైపరీత్యాలకు ఇంకొందరు ఇలా తనువు చాలిస్తున్నారు. కౌలు రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కౌలు రైతులకు అప్పు పుట్టక వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. తప్పలేక… విధిలేని పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీకి ప్రైవేట్​ వ్యాపారుల నుంచి అప్పు తీసుకువచ్చి పంటలు వేసినా.. దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక, అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఏడాది మొత్తం 379 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఆరేండ్ల వ్యవధిలో 4,218 మంది కన్నుమూశారు. రైతు స్వరాజ్య వేదిక – టాటా ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 81.4 % పత్తి రైతులున్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరి, మొక్కజొన్న, కంది రైతులుండటం గమనార్హం. సామాజిక వర్గాలపరంగా చూస్తే 61% బీసీలు, 17% ఎస్సీలు, 11% ఎస్టీలు, 11% ఇతరులు ఉన్నారు.

వాస్తవ రైతులను గుర్తించడం లేదు

రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది కౌలుదారులున్నా వారిని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాల సబ్సిడీ ఇలా అన్నింటినీ పట్టాదారులకే పరిమితం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకునే సదుపాయం కూడా కౌలు రైతులకు లేదు. ప్రభుత్వం మొదట్లో కౌలు రైతు రుణ అర్హత కార్డులను జారీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించి తర్వాత అమలు చేయలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు కూడా ఒప్పందం ప్రకారం భూ యజమానికి కౌలు చెల్లించాల్సి వస్తున్నది. దీంతో కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం సంభవిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా భూ యజమానుల ఖాతాల్లోనే పడుతున్నది.

రుణ అర్హత కార్డుల జారీ ఉత్తమాటే

కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం ‘రుణ, ఇతర అర్హతల గుర్తింపు కార్డు’ (ఎల్‌ఈసీ-లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కార్డు ఉన్న రైతుకు బ్యాంకు లోన్​ వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పరిహారం కూడా అందుతుంది. విత్తనాలు, ఇతర సబ్సిడీలూ వర్తిస్తాయి. ఆత్మహత్య చేసుకున్నా రైతుగానే గుర్తిస్తారు. ఈ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. 2015లో 44 వేల కార్డులు జారీ చేసినా.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో, తమకు ఏ రకంగానూ భరోసా లేకుండాపోయిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కూడా కౌలు రేట్లు తగ్గలేదని, ఎకరానికి సగటున రూ.15 వేలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. రైతు స్వరాజ్య వేదిక, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ 2018లోచేసి 692 మంది కౌలు రైతులపై అధ్యయనం చేస్తే.. కౌలు రైతుల ఆత్మహత్యలతో కుటుంబాలు కూడా రోడ్డు పడినట్లు తేలింది.

జీవో 194కు మంగళం

వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రత్యేక పరిహార ప్యాకేజీ పథకం ద్వారా రూ.6 లక్షలు మంజూరు చేయాలని జీవో నంబరు- 194 స్పష్టం చేస్తున్నది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పులు చెల్లించడానికి రూ.లక్ష చొప్పున సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేయాలి. త్రిసభ్య కమిటీ, ప్రాథమిక సమాచారం, శవ పంచనామా, పోస్టుమార్టం, పోలీసుల నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా ధ్రువీకరించినప్పటికీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేయడం లేదు. ఖజానాలో డబ్బుల్లేవని చెబుతుండటం గమనార్హం. 2014 నుంచి 2017 వరకు బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు పరిహారం పెండింగ్‌లో ఉంది. 2018 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి ‘రైతు బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి జీవో నంబర్‌- 194ను అమలు చేయటం మానేసింది. పాత బకాయిలనూ పెండింగ్‌లో పెట్టింది. ఈ జీవో కింద 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో 848 మందికి రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఇంకా 301 మందికి పరిహారం చెల్లింపును పెండింగ్​లో పెట్టింది.

కౌలు రైతుకు భరోసా ఏదీ!?

కౌలు రైతులను మిగిలిన రాష్ట్రాలు ఏదో ఒకరకంగా ఆదుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ను కౌలు రైతులకూ అమలు చేస్తోంది. కేరళ ప్రభుత్వం ‘కుడుంబశ్రీ’, ఒడిశా ప్రభుత్వం ‘కాలియా’ పథకంతో కౌలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తే మేలు జరుగుతుందని చెబుతున్నా.. తాము కౌలు రైతులను గుర్తించబోమని సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు.

కౌలు రైతులను ఎందుకు గుర్తించడం లేదు : కిరణ్​ కుమార్​, రైతు స్వరాజ్య వేదిక

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారి సమస్యలు పరిష్కరిస్తే ఆత్మహత్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాస్తవ సాగుదారులను గుర్తించి రైతుబంధు, రైతుబీమా, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలుచేయాలి. కౌలు రైతులకు ఎల్‌ఈసీ కార్డులు ఏటా పంపిణీ చేయాలి. వాస్తవానికి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రధాన సమస్యలను గాలికొదిలేస్తున్నది. రైతు బంధు కంటే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లిస్తే రైతులకు లాభం కలుగుతుంది.

రైతు స్వరాజ్య వేదిక, టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సర్వే

నివేదిక ప్రకారం కౌలు రైతుల ఆత్మహత్యల వివరాలు

ఏడాది కౌలు రైతులు

2014 724
2015 1134
2016 518
2017 689
2018 735
2019 418

Advertisement

Next Story