ఎమ్మెల్యే జోగురామన్నపై రిమ్స్ డైరెక్టర్ బలరాం ఆరోపణలు.. చివరికి..!

by Aamani |   ( Updated:2021-04-25 05:12:21.0  )
ఎమ్మెల్యే జోగురామన్నపై రిమ్స్ డైరెక్టర్ బలరాం ఆరోపణలు.. చివరికి..!
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో కరోనాపై నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఉన్నత పదవిలో ఉన్న డైరెక్టర్, అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న అధ్యక్షతన కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్ లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు వెళ్లారు. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు రెమిడిసివిర్, ఆక్సిజన్ ఇవ్వకుంటే నాపై కక్ష్య గట్టారని రిమ్స్ డైరెక్టర్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. నేను రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నా..నాపని నన్ను చేయనివ్వడం లేదని బలరాం నాయక్ అన్నారు.

నేనెవరిని ప్రత్యేకంగా మందులు ఇవ్వమని చెప్పలేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఈ సమయంలో వ్యక్తి గతాలు వద్దు.. ఈ కష్ట కాలంలో కలసి పని చేయాల్సిన సమయని తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అంత కలిసి కోవిడ్ పై పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం తో సమీక్ష సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇతర శాఖల అధికారులు జోక్యం చేసుకొని నచ్చజెప్పిన ఎవరు వెనక్కి తగ్గక పోగా సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. కరోనా విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన రాజకీయ నాయకులు, దేవుడిలా భావించే వైద్యులు ఇలా పాత కక్షలతో ఆరోపణలు చేసుకోవడంపై జిల్లాలో అందరూ చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed