రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం

by Harish |
Jofra Archer
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సంస్థకు చెందిన ఆయిల్-టూ-కెమికల్(ఓ2సీ) వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర అనుబంధ సంస్థగా మారడం ద్వారా భవిష్యత్తులో భారీ ఒప్పందాలకు అవకాశాలుంటాయని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరామ్‌కోతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో రిలయన్స్ సంస్థ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తన ఓ2సీ వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేసే ప్రణాళికపై వాటాదారులు, రుణదాతల ఆమోదాన్ని కోరింది. స్వతంత్ర అనుబంధ సంస్థగా ఉండటం వల్ల ఓ2సీ అవకాశాలపై దృష్టి సారించవచ్చని, తద్వారా సంస్థ విలువ మరింత పెరిగేందుకు దోహదపడుతుందని రిలయన్స్ సంస్థ అభిప్రాయపడింది. అలాగే, స్వయం మూలధనం నిర్మాణ ద్వారా సామార్థ్యాన్ని పెంచుకోవచ్చని, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో సంస్థ విలువను మెరుగుపరిచేందుకు వీలవుతుందని కంపెనీ పేర్కొంది.

పునర్వ్యవస్థీకరణ అనంతరం ఓ2సీ వ్యాపారంలో రిలయన్స్ గ్రూప్ 49.14 శాతం వాటాను కలిగి ఉంటుంది. దీనివల్ల కంపెనీ వాటాదారుల్లో ఎటువంటి మార్పులు ఉండవని రిలయన్స్ సంస్థ వివరించింది. ఈ అంశంపై ఇదివరకే సెబీ ఆమోదం లభించిందని, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఎన్‌సీఎల్‌టీల నుంచి ఆమోదం రావాల్సి ఉందని కంపెనీ తెలిపింది. ఈ డీ-మెర్జ్ ప్రక్రియ ద్వారా రిలయన్స్‌కు చెందిన పెట్రో కెమికల్, రెఫైనింగ్, మార్కెటింగ్ ఆస్తులు మొత్తం కొత్తగా ఏర్పడే అనుబంధ సంస్థకు బదిలీ కానున్నాయి. సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందం తర్వాత పెట్టుబడిదారుల నుంచి మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ఈ ప్రక్రియ సహాయపడుతుందని రిలయన్స్ వెల్లడించింది.

Advertisement

Next Story