రేషన్ షాపుల కాడ..నో సోషల్ డిస్టెన్స్

by Shyam |
రేషన్ షాపుల కాడ..నో సోషల్ డిస్టెన్స్
X

దిశ, మేడ్చల్: బతుకు దెరువు కోసం రాష్ట్రానికి వలసొచ్చిన కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు రూ.500 ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నారు. అయితే, కరోనా సాయాన్ని అందుకునేందుకు వచ్చిన రేషన్ దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరాన్ని) పాటించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం మొదట రాష్ట్ర ప్రజలకు మాత్రమే 12 కేజీల బియ్యం, రూ1,500 ఇవ్వాలని నిర్ణయించింది. కాని లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ వలస కూలీలు ఇబ్బందులు పడుతుండటంతో వారికీ బియ్యం, నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పంపిణీ జరుగుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రేషన్ దుకాణాల్లో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగానే ఇక్కడి ప్రజలకూ 12 కిలోల బియ్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో అటు వలస కూలీలు, ఇటు రేషన్ బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా రేషన్ దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో సామాజిక దూరం పాటించే పరిస్థితులు ఉండటం లేదు.

జిల్లాలో 14,411 మంది మాత్రమే గుర్తింపు..

మేడ్చల్ జిల్లా వలస కార్మికులకు మంచి అడ్డా. జిల్లాలోని పరిశ్రమలతో పాటు భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీల్లో పనిచేసే వారి సంఖ్య దాదాపు 30వేలకు పైగానే ఉంటుంది. కాని అధికారులు మాత్రం జిల్లాలో కేవలం 14,411 మందిని మాత్రమే గుర్తించారు. జిల్లా పరిధిలో బుధవారం నుంచి బియ్యం పంపిణీని ప్రారంభించారు. 13 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో గుర్తించిన వలస కూలీలందరికీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వలస కూలీలకు బియ్యం అందిస్తూ, నగదు బ్యాంకు ఖాతా ఉంటే.. ఖాతాలో జమ చేస్తుండగా, లేని వారికి నేరుగానే నగదు అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 7,100 మంది వలస కూలీలకు బియ్యం, నగదు ఇచ్చారు.

రేషన్ లబ్ధిదారులకు బియ్యం ఒక్కటే..

మేడ్చల్ జిల్లా పరిధిలో 4.95 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 25 వేల కుటుంబాలకు మాత్రమే బియ్యం అందాయి. బుధవారం 246 రేషన్ దుకాణాల్లో మాత్రమే బియ్యం పంపిణీ చేయగా, గురువారం నుంచి మిగిలిన 390 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండటంపై లబ్ధిదారులు పెదవివిరుస్తున్నారు. దాదాపు రెండు వారాలు కావొస్తుంది. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. ప్రభుత్వం ముందుగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, ఉప్పు, పప్పు, నూనెలు అందిస్తామంది. అవి లేనిపక్షంలో బియ్యంతో పాటు రూ.1500 ఇస్తామని చెప్పింది. కాని ఇప్పడు బియ్యంతోనే సరిపెడుతోందని అంటున్నారు.

కిక్కిరిసిన దుకాణాలు..

రేషన్ దుకాణాల్లో టోకెన్ విధానం అమలు చేసి.. రోజుకు వందమంది చొప్పున అందరికీ బియ్యం అందజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. బియ్యంతో పాటే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో ప్రజలు పెద్దఎత్తున రేషన్ దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. కాని బియ్యం మాత్రమే పంపిణీ చేసి.. నగదును బ్యాంకు ఖాతాలో వేస్తామని డీలర్లు చెబుతున్నారు. అయితే, వలస కూలీలకు బియ్యంతో పాటు నగదు అందిస్తున్నారు.

పెద్దఎత్తున క్యూలైన్లలో వలస కూలీలు..

ఒరిస్సా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మేడ్చల్ జిల్లాకు వలసొచ్చిన కూలీలు బియ్యం పంపిణీ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. బియ్యం తీసుకునే క్రమంలో సామాజిక దూరం పాటించకపోవడంతో పోలీసులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా అందరూ వచ్చి ఇబ్బందులు పడొద్దనీ, అందరికీ బియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా.. ఎవరూ వినడం లేదు. అయితే, బియ్యం ఎక్కడ అయిపోతాయోనని రేషన్ దుకాణాల వద్దకు కూలీలు భారీగా వస్తున్నారు.

Tags : rice distribution, migrant workers, medchal dist, no social distance

Advertisement

Next Story