మోదీ, కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-11-27 07:43:32.0  )
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి కొనకపోతే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో 67 వేల మంది రైతులు చనిపోయారని, రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని, వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ధాన్యం మొత్తం రోడ్లపై ఉందని, అకాల వర్షాలతో తడిసి మొలకలు వస్తుందని, అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు.

గుండు, అరగుండు కలిసి మనకు పంగనామాలు పెడతారని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ వేరు కాదని, ఒకరు సారా మరొకరు సోడా అని, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తోడుదొంగలేనని మండిపడ్డారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్.. రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి గుర్తు చేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ విధానాన్ని తీసుకొచ్చి, గిట్టుబాటు ధర కల్పించింది కాంగ్రెస్‌ అని అన్నారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 8 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమేనన్నారు. ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story