గజ్వేల్ నుంచే TRS పతనం.. రేవంత్ పక్కా ప్లాన్.?

by Shyam |   ( Updated:2021-06-28 04:43:23.0  )
Revanth-reddy-and-kcr
X

దిశ ప్రతినిధి, మెదక్ : కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించింది. రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్న ఇతర పార్టీ నాయకులు బీజేపీ, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ తీరు నచ్చక బీజేపీలో చేరిన వారు సైతం రేవంత్ సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డితో.. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులు సమావేశం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో నేటి నుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గజ్వేల్ నుంచే ప్రారంభం..

అధికార పార్టీ తీరు నచ్చక చాలా మంది మాజీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరారు. కాగా, శనివారం జాతీయ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో యూత్, మాస్ లీడర్‌గా పేరొందిన రేవంత్ సైన్యంలో చేరేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి భారీగా చేరికలు జరగనున్నాయని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే తన వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం.

డీసీసీ అధ్యక్షుడిని కలిసిన మాజీ ప్రజాప్రతినిధులు..

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఇంట్లో గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తుప్రాన్ మున్సిపల్ తాజా కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సంస్థ గత చైర్మన్లు ఆదివారం సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీలో చేరిన వారు కూడా రేవంత్ రెడ్డికే పీసీసీ వస్తుందని తెలిసి ఉంటే.. బీజేపీలో చేరే వాళ్లం కాదని, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతామని ప్రకటించడం విశేషం. మొత్తానికి సీఎం ఇలఖాలో తిరిగి కాంగ్రెస్‌కు పునర్ వైభవం రానుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisement

Next Story