‘రిజర్వేషన్లు’ ప్రాథమిక హక్కు కాదు!

by Shamantha N |

సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో, ఉద్యోగోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. అలాగే, రాష్ట్రాలు తప్పనిసరిగా ఈ రిజర్వేషన్లు అమలు చేసి తీరాలన్న నిబంధనలేవీ లేవని చెప్పింది. రాష్ట్రాలు కచ్చితంగా కోటా అమలు చేయాలనీ న్యాయస్థానం మాండమస్(జ్యుడిషియరీ రిట్) జారీ చేయలేదని వివరించింది. అంతేగానీ, రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రాలు కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చింది. అయితే, రిజర్వేషన్ల అమలు పై ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించిన గణాంకాలను రాష్ట్రాలు సేకరించాల్సి ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు.. ఆ రాష్ట్రానికి 2012లో జారీ చేసిన ఆదేశాలను న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఆయా వర్గాలకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగా.. రిజర్వేషన్లు కల్పించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, కాలిన్ గొంజాల్వెజ్, దుష్యంత్ దవేలు వాదించారు. రాజ్యాంగంలోని 16(4), 16(4ఏ) అధికరణాలు ఎస్సీ, ఎస్టీల సహాయం చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాలకు కట్టబెడుతున్నాయని వాదనలు వినిపించారు. కాగా, ఈ అధికరణాల ప్రకారం.. రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు కాదని ఉత్తరాఖండ్ సర్కారు తరఫున వాదిస్తున్న లాయర్లు పేర్కొన్నారు. వీరి అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తాజా రూలింగ్ ఇచ్చింది.

రిజర్వేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు 2018లో రూలింగ్ ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా దళితులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం ఆ తీర్పు పై స్టే విధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో రిజర్వేషన్ అంశమూ ముందుకొచ్చింది. దళితుల హక్కులను కేంద్ర సర్కారు కాలరాస్తున్నదన్న భయాందోళనలు ఆ వర్గాల్లో బలంగా నాటుకుంటోన్న సందర్భంలో తాజా తీర్పు రావడం గమనార్హం.

‘మెరిట్’ వాదం ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు చర్చనీయాంశమవుతోంది. మెరిట్ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరగాలన్న వాదనతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వందల సంవత్సరాలు ‘వెలివేత’కు గురైన అణగారిన వర్గాలు నష్టపోతాయని దళితవాదులు, మేధావులు వాదిస్తున్నారు. అన్ని సదుపాయాలను అనుభవించగలిగిన వర్గాలతో అట్టడుగువర్గాలు పోటీపడలేవని వివరిస్తున్నారు. అందుకే అట్టడుగు వర్గాలు మిగితా వర్గాలతో సమానత్వాన్ని సాధించడానికి రిజర్వేషన్లు కీలకమని చెబుతున్నారు. అలాగే, రిజర్వేషన్లు ఆర్థిక స్థితి ఆధారంగా నిర్ణయించాలన్న వాదనతోనూ దళిత అస్తిత్వ సంఘాలు, సామాజిక కార్యకర్తలు విభేదిస్తున్నారు. రిజర్వేషన్లను కేవలం ఆర్థికాంశానికే కుదించొద్దని, అది సామాజిక రుగ్మతలనూ నిర్మూలించే ఉద్దేశంతో అమలు చేశారని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed