అసోం రాతాబరిలో రీపోలింగ్

by Shamantha N |   ( Updated:2021-04-02 02:24:05.0  )
అసోం రాతాబరిలో రీపోలింగ్
X

గువహతి: అసోంలో ఈవీఎంలు బీజేపీ క్యాండిడేట్ కారులో కనిపించిన వీడియో సంచలనం రేపింది. కార్యకర్తల ఘర్షణలు, ప్రతిపక్షాల విమర్శల నడుమ ఎన్నికల కమిషన్ స్పందించింది. రాతాబరి సీటులోని 179వ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈవీఎం రవాణాకు బాధ్యతపడ్డ నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అసోంలో రెండో విడత పోలింగ్ గురువారం ముగిసింది. పోల్ స్టేషన్ల నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంలను తరలించేటప్పుడు బాధ్యులైన అధికారులు వాహన సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. వెహికల్ కోసం ప్రిసైడింగ్ అధికారి, సెక్టార్ ఆఫీసర్‌కు కాల్ చేశారు. వాహనాన్ని పంపిస్తామని చెప్పినప్పటికీ మరో వాహనంలో లిఫ్ట్ తీసుకుని స్ట్రాంగ్ రూమ్‌కు ప్రయాణించినట్టు తెలిసింది.

ఈసీ అధికారులు ఈవీఎంలతో వెళ్లిన ఆ బొలెరో కారు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే క్రిష్ణేందు పాల్ సతీమణికి చెందినది. స్ట్రాంగ్ రూమ్‌కు ఈ కారు చేరగానే అక్కడే ఉన్న ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వాహనాన్ని గుర్తించి దాడికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఒకానొక దశలో వాహనాన్ని విడిచి పరుగులు పెట్టాల్సి వచ్చింది. కారులోని ఈవీఎంను చూపించిన వీడియోను జర్నలిస్టు అతాను భుయాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతూ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ అనుసరించే మార్గాలు ఇవేనని విపక్ష నేతలు ఆరోపణలు సంధించారు.

Advertisement

Next Story

Most Viewed