సెప్టెంబర్‌లో మళ్లీ ఐపీఎల్?

by Anukaran |
సెప్టెంబర్‌లో మళ్లీ ఐపీఎల్?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వాయిదా పడటంతో బీసీసీఐకి ఆదాయమే కాకుండా గౌరవం కూడా దెబ్బతిన్నది. కరోనా కాలంలో పంతానికి పోయి ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించి అపప్రద మూటగట్టుకుంది. గత ఏడాది లాగానే యూఏఈలో నిర్వహించి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావనే వ్యాఖ్యలు వినిపిస్తున్నది. కాగా, వాయిదా వేసిన ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లను ఈ ఏడాదే ముగించేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తగ్గకుండా ఉండాలంటే 14వ సీజన్ పూర్తి చేయాల్సిందేనని బోర్డులోని కొందరు సభ్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఐపీఎల్ నిర్వహణకు అనుకూలమైన సమయం, వేదికల కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి బీసీసీఐ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే యూఏఈలోనే ఐపీఎల్ నిర్వహించడం లేదా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఏదో ఒక దేశానికి ఐపీఎల్‌ను తరలించడం. ఇందులో అందరూ యూఏఈ వైపే మొగ్గు చూపుతున్నారు.

యూఏఈ ఇదీ సమస్య..

ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహించడానికి సెప్టెంబర్ నెలలో సమయం దొరికే అవకాశం ఉన్నది. ఆ సమయంలో ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (ఎఫ్‌టీపీ) కూడా పెద్దగా ఏమీ లేవు. దీంతో టీ20 వరల్డ్ కప్ ముందు యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. అయితే యూఏఈలో సెప్టెంబర్ నెలలో ఉస్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్లు అంత ఉష్ణోగ్రతలో మ్యాచ్‌లు ఆడగలరా అనే సందేహం కూడా ఉన్నది. మరోవైపు ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా యూఏఈ తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ ముందే ఐపీఎల్ ముగిసేలా ప్రణాళిక సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇంగ్లాండ్ టూర్‌కు వరల్డ్ కప్‌కు మధ్య ఉన్న విండోను ఉపయోగించుకోవడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఇక ఆస్ట్రేలియాను కూడా ప్రత్యామ్నాయ వేదికగా బీసీసీఐ పరిశీలిస్తున్నది. క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ మధ్య ఉన్న స్నేహంతో ఈ ఆప్షన కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల పట్ల కఠిన మైన ఆంక్షలు విధించింది. కాగా, మరో నాలుగు నెలల తర్వాత ఆ ఆంక్షలు సడలిస్తే ఆసీస్ గడ్డపై ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదు.

మా దగ్గరకు రండి..

వాయదా పడిన ఐపీఎల్‌ను మాదగ్గర పూర్తి చేయమంటూ నాలుగు ఇంగ్లీష్ కౌంటీలు బీసీసీఐకి ఆఫర్ ఇస్తున్నాయి. ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటన సెప్టెంబర్ 14న ముగియనున్నది. ఆ తర్వాత అక్కడే ఐపీఎల్ నిర్వహించాలని ఇంగ్లాండ్‌కు చెందిన మిడిల్ సెక్స్, సర్రే, వార్విక్‌షైర్, లాంకషైర్ కౌంటీలు కోరుతున్నాయి. ఒకే వేదిక కాకపోయినా ఈ నాలుగు కౌంటీలకు చెందిన మైదానాలను ఉపయోగించుకోవచ్చని బీసీసీఐకి ఆఫర్ ఇచ్చాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహించడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు, హోటల్స్, లాజిస్టిక్స్ అన్నీ అందుబాటులో ఉంటాయని సదరు కౌంటీలు చెబుతున్నాయి. లార్డ్స్, ఓవల్, ఎడ్జ్‌బాస్టర్, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ తో కలిసి మిగిలిన కౌంటీలు అన్నీ ఐపీఎల్ నిర్వహించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి లేఖ రాశాయి. బీసీసీఐకి కేవలం 20 రోజుల సమయం దొరికితే ఐపీఎల్ ముగించేయాలని భావిస్తున్నాయి. సెప్టెంబర్ 14 తర్వాత వరల్డ్ కప్ లోపు ఆ సమయం ఉండటంతో బీసీసీఐ ఆ సీజన్‌లోనే ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉన్నది. కాగా, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్స్ మీటింగ్‌కు బీసీసీఐ, ఈసీబీ ప్రతినిధులు హాజరవనున్నారు. ఆ సమావేశంలో ఐపీఎల్ గురించిన చర్చ జరగనున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఐపీఎల్‌ను సెప్టెంబర్‌లోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Next Story