రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు కైవసం!

by Harish |   ( Updated:2020-07-06 07:00:44.0  )
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు కైవసం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 11.5 లక్షల కోట్లను దాటేసింది. సోమవారం మిడ్ సెషన్ సమయానికి ఏకంగా షేర్ ధర 2.55 శాతానికి పైగా పెరిగి రూ. 1,848.10కి చేరింది. ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థ జియోలో వరుస పెట్టుబడుల రాకతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాల్ ఊహించని విధంగా దూసుకెళ్లింది. అంతేకాకుండా, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రిలయన్స్ సంస్థను రుణరహిత సంస్థగా మారుస్తానని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అయితే, ఈ లక్ష్యాన్ని గడువుకు 10 నెలల ముందే చేరుకున్నారు. దీంతో రిలయన్స్ షేర్లకు భారీగా విలువ పెరిగింది. పైగా, కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ విలువను పెంచుకున్న భారత కంపెనీల్లో రిలయన్స్ అగ్రస్థానంలో ఉంది. అనేక సంస్థలు నష్టపోవడం, స్వల్పంగా లాభపడంతో సరిపెట్టాయి కానీ, రిలయన్స్ మాత్రమే భారీగా లాభాలను ఆర్జించింది. గత మూడు నెలల కాలంలో మొత్తం 12 పెట్టుబడులతో పాటు రైట్స్ ఇష్యూ ద్వారా తక్కువ కాలంలో రిలయన్స్ కంపెనీ రూ. 1.68 లక్షల కోట్లను సమీకరించింది.

అంతేకాకుండా, లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిన టాప్-100 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి 89వ స్థానం దక్కింది. కరోనా సమయంలోనూ ఎదిగిన కంపెనీల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో రిలయన్స్‌కు కూడా చోటు దక్కడం విశేషం. ఇక, రిలయన్స్ షేర్ ధర ఈ ఏడాది చివరికి రూ. 2 వేలకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్ క్యాప్ కూడా ఈ ఏడాది చివరికి రూ. 12 లక్షల కోట్లను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story