ఫ్యాషన్ బ్రాండ్ పోర్టికోలో వాటా కోసం రిలయన్స్ చర్చలు!

by Harish |
Reliance Industries
X

దిశ, వెబ్‌డెస్క్: క్రియేటివ్ గ్రూప్ యాజమాన్యంలోని గృహావసరాల ఉత్పత్తుల ఫ్యాషన్ బ్రాండ్ పోర్టికోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) గణనీయమైన వాటా కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. క్రియేటివ్ గ్రూప్ సంస్థ 2005లో పోర్టికో బ్రాండ్‌ను ప్రారంభించి ఇంటి అవసరాలకు వినియోగించే పలు రకాల ఉత్పత్తులను స్వంత దుకాణాలతో పాటు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం 200కి పైగా ఔట్‌లెట్లను కంపెనీ కలిగి ఉంది. ఒప్పందం దాదాపుగా పూర్తయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020, ఫిబ్రవరిలో రిలయన్స్ సంస్థ ప్రముఖ టెక్స్‌టైల్స్ తయారీ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్‌లో 37.7 శాతం వాటాను రూ. 250 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోర్టికోలో వాటా కొనుగోలు పూర్తయితే అలోక్ ఇండస్ట్రీస్‌తో అనుసంధానం చేయవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అయితే, ఈ అంశం గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్, పోర్టికో అధికారికంగా స్పందించలేదు. ‘మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ పోర్టికో ఇండియా తక్కువ సమయంలో వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలో ఇంటి అవసరాలకు ఉత్పత్తుల విక్రయంలో రెండో స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో మరింత కీలకమైన బ్రాండ్‌గా, ఇంటీరియర్ ఉత్పత్తుల్లో మెరుగైన అమ్మకాలను సాధించగలమని పోర్టికో తన వెబ్‌సైట్‌లో కంపెనీ గురించి వివరాలను పొందుపరిచింది.

Advertisement

Next Story