మళ్ళీ.. క్వారంటైన్ సెంటర్లు ఫుల్!

by vinod kumar |
మళ్ళీ.. క్వారంటైన్ సెంటర్లు ఫుల్!
X

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాపించిన కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా అనుమానితులకు నగరంలోని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలలో క్వారంటైన్ గడువు ముగియడంతో అందరినీ ఇళ్లకు పంపించారు. అందులో పాజిటివ్ వచ్చిన కేసులను చికిత్స నిమిత్తం తరలించడంతో క్వారంటైన్ కేంద్రాలన్నీ ఖాళీ అయ్యాయి. అయితే, సరిగ్గా వారం తిరిగే లోపే ఈ క్వారంటైన్ కేంద్రాలు మళ్ళీ ఫుల్ అయ్యాయంటే కరోనా వైరస్ ప్రభావం ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మొదటి విడతలో 616 చేరిక..

కరోనా వైరస్ నగరానికి చేరిన పిదప ప్రభుత్వం పాతబస్తీ నిజామియా ఆస్పత్రి, మెహిదీపట్నం సరోజినిదేవి కంటి ఆస్పత్రి, అమీర్ పేట‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి, జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీ, షేక్‌పేట నారాయణమ్మ కళాశాలల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఎంసీహెచ్ ఆర్డీ, నారాయణమ్మ కళాశాలల క్వారంటైన్ కేంద్రాలలో ఎవరినీ ఉంచలేదు. మిగతావాటిలో నిజామియా ఆస్పత్రిలో 249, సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 157, నేచర్ క్యూర్ ఆస్పత్రిలో 210 మందితో కలిపి మొత్తం 616 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. వీరిలో 45 మందికి పాజిటివ్ అని తేలింది. క్వారంటైన్ గడువు ముగిసిన మిగితా వారందరినీ ఈ నెల 9వ తేదీన వారి ఇళ్ళకు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇక హైదరాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టిగానే పలువురు భావించారు.

క్వారంటైన్ కేంద్రాలు మళ్ళీ ఫుల్..

ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల అంశం వెలుగులోకి వచ్చాక.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయి. నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన 1,100 మందిలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారే 604 మంది ఉన్నట్టు అధికారులు తేల్చారు. అయితే, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వీరి కాంట్రాక్ట్ జాబితాను అధికారులు పట్టుకుని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఖాళీ అయిన క్వారంటైన్ కేంద్రాలన్నీ.. మళ్ళీ ఫుల్ అవుతున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి నగరంలో పాతబస్తీ నిజామియా ఆస్పత్రి, మెహిదీపట్నం సరోజినిదేవి ఆస్పత్రి, అమీర్ పేట నేచర్ క్యూర్ ఆస్పత్రితోపాటు ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో క్వారంటైన్ కేంద్రాలున్నాయి. వీటిని కలెక్టర్ శ్వేతా మహాంతి పర్యవేక్షిస్తున్నారు. వీటిలో నిజామియాలో 247 మంది, సరోజినిదేవిలో 144 మంది, నేచర్ క్యూర్‌లో 250 మంది, ఆయుర్వేదలో 52 మంది ఉన్నారు. వీరిలో నిజామియాలో 56 మందికి, సరోజినిలో 35 మందికి పాజిటివ్ రాగా, ఆయుర్వేద ఆస్పత్రిలో 28 మందికి నెగిటివ్ రాగా.. 24 మంది రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే నెగిటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేసేందుకు ఉన్నతాధికారులు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

Tags: Quarantine Centers, Corona Effect, Hyderabad Collectorate,Collector ShwetaMahanthi

Advertisement

Next Story

Most Viewed