‘మ్యూచువల్ ఫండ్’కు ఆర్‌బీఐ ఊతం!

by Shyam |
‘మ్యూచువల్ ఫండ్’కు ఆర్‌బీఐ ఊతం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోమవారం ఉదయం కొవిడ్-19 వల్ల నష్టాలను తగ్గించేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు రూ. 50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని ఇవ్వనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. సోమవారం నుంచి మే 11 వరకూ ఈ సదుపాయం ఉంటుందని వివరించింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు తద్వారా కరోనా వైరస్, లాక్‌డౌన్ ఆంక్షల నష్టాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నిర్ణీత రెపో రేటుతో ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యం-మ్యూచువల్ ఫండ్స్ కింద 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలు ఆర్‌బీఐ నిర్వహించనుంది. సోమవారం నుంచి మే 11 వరకూ దీనికి అనుమతి ఉంటుంది. సంబంధిత నిధులను పొందడానికి శుక్రవారం వరకూ బిడ్లను సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఆర్థి స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ సానుకూలంగా స్పందించాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రెండు రోజుల క్రితం 6 డెట్ ఫండ్ స్కీమ్‌లను నిలిపేస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక కష్టాలు తొలగించేందుకు రంగంలోకి ఆర్బీఐ :

కరోనా వల్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి దిగజారుతోంది. పెట్టుబడిదారులు ఎక్కువగా నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ద్రవ్య లభ్యత లేక పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఉపసంహరణలు భారీగా పెరగడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ ఒత్తిడి హైరిస్క్ ఉన్న పథకాల్లో మాత్రమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఉన్న ఆర్థిక కష్టాలను తొలగించే ఉద్దేశంతో ప్రత్యేక ద్రవ్య లభ్యత అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సోమవారం మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ షేర్లు అధిక లాభాల్లోకి దూసుకెళ్లాయి.

పరిశ్రమ అవసరాలకే వినియోగం :

ఆర్‌బీఐ ప్రకటించిన లిక్విడిటీ సౌకర్యాలను బ్యాంకులు కేవలం మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్‌లకు రుణాలు అందించడం, ఫండ్స్ దగ్గరున్న కార్పొరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్, డిబెంచర్స్ వంటి హామీల ఆధారంగా లిక్విడిటీని సమకూర్చవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో పరిశ్రమకు గొప్ప ఉపశమనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం గురించి స్పందించిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం ప్రశంసించారు. ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పథకాలు నిలిపేయడం వల్ల ఎదురైన సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నారు.

గడువు పెంచవచ్చు :

స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ పేరుతో 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను స్థిర రెపో రేటుతో నిర్వహించనున్నారు. మే 11వ తేదీ వరకు లేకుంటే కేటాయించిన నిధులు మొత్తం ఉపయోగించుకునే వరకు బిడ్స్ సమర్పించవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ రెండిటిలో ఏది ముందైతే అది వర్తిస్తుందని, మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి మాత్రమే బ్యాంకులు వీటిని వినియోగించాల్సి ఉంటుందని వివరించింది. బ్యాంకులు.. మ్యూచువల్ ఫండ్స్‌కు లోన్ల గడువును పెంచవచ్చని చెప్పింది.

ఆర్‌బీఐ ఈ ప్రకటనతో మ్యూచువల్ ఫండ్స్‌కు భారీ ఊతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమకు ఉపశమనంగా ఆర్‌బీఐ ప్రకటన ఉందని, ముఖ్యంగా క్రెడిట్ రిస్క్ ఫండ్ కేటగిరీలో ఒత్తిడి అధికంగా ఉందని, ఇందులో రూ.55,000 కోట్లకు పైగా అసెట్స్ ఉన్నాయని, డెట్ సెగ్మెంట్‍లో మార్చి నెలలో రూ.1.94 కోట్ల ఔట్ ఫ్లో ఉందని పరిశ్రమలు వర్గాలు చెబుతున్నాయి.

Tags : mutual funds, RBI, Reserve Bank of India, MF

Advertisement

Next Story

Most Viewed