రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 5కిలోలు మాత్రమే

by Shyam |   ( Updated:2020-08-24 23:12:34.0  )
రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 5కిలోలు మాత్రమే
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కోత విధించింది. కరోనా వ్యాప్తి చెందని కాలంలో రేషన్ కార్డున్న ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యాన్ని అందించిన ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం పరిధిలో రేషన్ కార్డులున్న 53.29 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 5కిలోల బియ్యాన్ని మాత్రమే అందిస్తోందని బాధితులు వాపోతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా అసలే ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో వచ్చే రేషన్ బియ్యం కూడా తగ్గించడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వ్యాపించకముందు రోజుల్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ ఒక్క రూపాయికే కిలో చొప్పున 6కిలోల బియ్యాన్ని ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రభుత్వం అందించింది. అయితే కరోనాతో ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, పనులు దొరక్కపోవడంతో పేద, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో రేషన్ కార్డున్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 12కిలోలు బియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి 10కిలోలు రేషన్ బియ్యం అందిస్తోంది. అయితే 10 కిలోల బియ్యంలో 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా, మరో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉన్నట్లు వారు వివరిస్తున్నారు. అంటే కరోనాకు ముందు ప్రతి వ్యక్తికీ 6కిలోల బియ్యాన్ని అందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా విజృంభించి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఒక కిలో బియ్యాన్ని తగ్గించి కేంద్రం అందిస్తున్న వాటాతో కలిపి 10 కిలోల బియ్యాన్ని మాత్రమే అందిస్తోందని చెబుతున్నారు.

53.29లక్షల కుటుంబాలకు సమస్య..

రాష్ట్రంలో మొత్తం 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 87.59 లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డులతో మొత్తం 2.83 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు. వీరికి బియ్యాన్ని అందించేందుకు రాష్ట్రంలో మొత్తం 17,018 రేషన్ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కేంద్ర పరిధిలో కార్డులున్న కుటుంబాలు 53.29లక్షలు ఉండగా, రాష్ట్ర పరిధిలో 34.30 లక్షల కార్డులున్నాయి. ప్రస్తుతం వీరందరికీ ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి. అయితే తమకు ఇవ్వాల్సింది 10 కిలోలు కాదని, మొత్తం 11 కిలోలు ఇవ్వాలని కేంద్రం పరిధిలోని రేషన్ కార్డుదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర పరిధిలోని రేషన్ కార్డులున్న53.29 లక్షల కుటుంబాలకు బియ్యం అందించేందుకు కేంద్రం నుంచి రాష్ట్రం కిలో బియ్యం రూ.3కు కొనుగోలు చేసి వారికి అందిస్తున్నది. కరోనాకు ముందు కూడా ఈ కార్డుల వారికి కేంద్రం నుంచే రూ.3కు కిలో బియ్యాన్ని ఖరీదు చేసి 6కిలోలు అందించేదని, కానీ ప్రస్తుతం 6కిలోలకు బదులుగా 5కిలోల బియ్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు వారు విమర్శిస్తున్నారు. తమకు లెక్కప్రకారం ఒక్కొక్కరికి 11కిలోలు తప్పనిసరిగా రావాల్సి ఉందని, కానీ 10కిలోలు మాత్రమే ఇస్తోందని, వెంటనే తమకు గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ఇవ్వాలని బాధిత లబ్దిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed