రష్మిక, స్వీటీలు మెచ్చిన షార్ట్ ఫిల్మ్

by Shyam |
రష్మిక, స్వీటీలు మెచ్చిన షార్ట్ ఫిల్మ్
X

పెద్ద పెద్ద సినిమాలే ఓటీటీలో విడుదలవుతున్న రోజులివి. క్రేజీ డైరెక్టర్లు, స్టార్ హీరోలు, హీరోయిన్లు.. వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న కాలమిది. ఇలాంటి తరుణంలో.. ఓ షార్ట్ ఫిల్మ్ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడం నిజంగా అద్భుతమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక మందాన్న, అనుష్క శెట్టి.. ఇటీవల ఓ చిత్రం తమకు చాలా బాగా నచ్చిందని, దర్శకుడు ఎంతో అద్భుతంగా తీశాడని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే.. ‘మనసా నమ:’.

‘సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంది. నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు చాలా బ్రిలియంట్‌గా తీశాడు. ఈ అద్భుతమైన చిత్రంలో నటించిన వాళ్లందరికీ నా అభినందనలు’ అని అనుష్క తెలిపింది. ఇక రష్మిక మందాన్న కూడా ‘మనసా నమ:’ అందరూ చూడాల్సిన సినిమా అని కొనియాడింది. ఇదొక అందమైన చిత్రం అంటూ ఈ క్యూట్ బ్యూటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వీళ్లే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా అందరి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 70 అంతర్జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది. చిత్ర కథ విషయానికొస్తే.. సాధారణంగా మనకు మూడు కాలాలుంటాయి. ఈ మూడు కాలాల్లో ఆయా వాతావరణాలకనుగుణంగా సూర్యుడు మార్పు చెందుతాడు. అలానే సూర్య అనే వ్యక్తి.. మూడు కాలాల్లో ముగ్గురు అమ్మాయిలతో ప్రవర్తించే విధానాన్ని ఇందులో దర్శకుడు చూపించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దీపక్.. ఇంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. యూఎస్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేసిన దీపక్.. సినిమాలపై ఆసక్తితో ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు.

Advertisement

Next Story