మహిళలు, చిన్నారులను వేధిస్తే గ్రామబహిష్కరణే.. ఎక్కడంటే?

by Shyam |
మహిళలు, చిన్నారులను వేధిస్తే గ్రామబహిష్కరణే.. ఎక్కడంటే?
X

దిశ, రామారెడ్డి : దేవతా మూర్తులను కొలిచే మన దేశంలో కొందరు మానవ మృగాల దుశ్చర్యల వలన మహిళలు, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. అలాంటి వారికి సమాజంలో చోటు ఇవ్వకుండా శిక్షించాలని, మనవంతు బాధ్యతగా గ్రామాల్లో అలాంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడితే ముక్తకంఠంతో వారిని ఎదురించడమే కాకుండా.. వారికి సరైన శిక్ష విధించేందుకు ఓ గ్రామపాలక వర్గం వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఎవరైనా గ్రామంలోని మహిళలు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని గ్రామం నుంచి బహిష్కరించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇకమీదట రామారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైనా ఆడపిల్లలను, మహిళలను వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా గ్రామం నుండి వెలివేస్తామని, అంతేగాక పోలీసులకు అప్పగించి శిక్ష పడేవరకు పోరాడతామని స్పష్టంచేశారు.

ఇబ్బందులకు గురైన మహిళలకు, ఆడపిల్లలకు గ్రామ పంచాయతీ పాలకవర్గం అన్నివేళలా అండగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఎంపీటీసీ భాగ్య, వార్డు సభ్యులు రూప, దోమల లక్ష్మి, గాయత్రి, కవిత, పద్మ, గంగాధర్, ప్రసాద్, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed