ఆట మొదలైంది.. ఆడదాం!

by Shamantha N |
ఆట మొదలైంది.. ఆడదాం!
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ దేశాన్ని దోచుకుంటున్నదని, ఆ పార్టీకి ఓటు వేయొద్దని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించాలని కోరారు. నందిగ్రామ్‌లో జరిగిన ‘కిసాన్ మహాపంచాయత్‌’లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. టికాయత్ మాట్లాడుతూ.. ‘నూతన రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సుమారు 110 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పోరాడుతున్నారు. కేంద్రం మెడలు వంచేదాకా వెనక్కి తగ్గేది లేదని అక్కడ శాశ్వత నివాసాలను కూడా నిర్మించుకుంటున్నారు.

అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటున్నది. వారికి ఓటెయద్దు. బెంగాల్ ప్రజలకు ఇదే నా పిలుపు. ఒకవేళ బీజేపీ నాయకులు మీ దగ్గరికొచ్చి ఓటు అడిగితే మా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఎప్పుడిస్తారు..? అని నిలదీయండి’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ నినాదమైన ‘ఖేలా హొబె.. ఖేలా’ (ఆట మొదలైంది.. ఆడుదాం) అని నినదించారు. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన భారీ స్థాయిలో వచ్చింది. రైతు చట్టాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల సంయుక్త వేధిక అధ్యక్షుడిగా ఉన్న టికాయత్.. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed