'నీతి అయోగ్‌' కీలక పోస్టులో తెలంగాణ అధికారి

by Shyam |
నీతి అయోగ్‌ కీలక పోస్టులో తెలంగాణ అధికారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికే ‘థింక్ టాంక్’గా చెప్పుకునే ‘నీతి అయోగ్‌’లో స్పెషల్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన అధికారి కొలనుపాక రాజేశ్వర్‌ రావు నియమితులయ్యారు. కేంద్ర అపాయింట్‌మెంట్స్ కమిటీ మంగళవారం సమావేశమై ఈ నిర్యయం తీసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన డాక్టర్‌ రాజేశ్వర్‌రావు త్రిపుర కేడర్‌ (1988 ఐఏఎస్‌ బ్యాచ్‌). ప్రస్తుతం నీతి అయోగ్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సైకాలజిలో పీజీ చేసి సోషల్‌ సైన్స్‌లో డాక్టరేట్‌ పొందారు. జర్నలిజంలోనూ పీజీ పట్టా అందుకున్నారు. నీటిపారుదల రంగ నిపుణుడు దివంగత విద్యాసాగర్‌రావు మేనల్లుడైన రాజేశ్వరరావు జాతీయ స్థాయిలో మినరల్‌ పాలసీ కమిటీకి చైర్మన్‌గా కూడా గతంలో వ్యవహరించారు. మినరల్ పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం మార్గదర్శకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజేశ్వరరావు ఇకపైన నీతి అయోగ్‌లో ప్రత్యేక కార్యదర్శిగా తన వంతు పాత్ర పోషించనున్నారు. ఆ బాధ్యతలు అందుకోవడం గర్వంగా ఉందని రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయినా నలుగురు అక్కలను, ముగ్గురు అన్నదమ్ములైన తమను పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించి ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణమన్నారు. తన ఇద్దరు మేనల్లుళ్లు కూడా ఐఏఎస్‌లేనని, ఒకరు (కృష్ణ అదిత్య) ములుగు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారని, మరొకరు (కృష్ణ చైతన్య) మధ్యప్రదేశ్‌ కేడర్‌గా ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed