ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

by Shyam |
ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
X

దిశ, స్పోర్ట్స్: అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టేడియాన్ని మన దేశంలోనే చూడవచ్చు. త్వరలో జైపూర్ నగర శివార్లలో 75వేల ప్రేక్షకుల సామర్థ్యంతో భారీ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్ (ఆర్‌సీఏ) కార్యదర్శి మహేంద్ర శర్మ తెలిపారు. 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.350కోట్లతో ఈ భారీ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై ఉన్న చాంప్ అనే గ్రామంలో ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కావల్సి ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. మరో నాలుగు నెలల్లో కొత్త స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు ఆర్సీఏ తెలిపింది. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన మొతేరా స్టేడియం 1.10 లక్షల మంది సామర్థ్యంతో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతి స్థానంలో 1.05లక్షల సామర్థ్యంతో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ఉండగా ఇప్పుడు నిర్మించబోయేది మూడో అతిపెద్ద స్టేడియం కానుంది. ఈ స్టేడియంలో ఇండోర్ గేమ్స్, శిక్షణ కోసం ప్రత్యేక వసతులు, క్లబ్ హౌస్, 4 వేల కార్ల పార్కింగ్ స్పేస్ కలిగి ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed