భారతదేశం అనాథాశ్రమం కాదు: రాజాసింగ్

by Shyam |
భారతదేశం అనాథాశ్రమం కాదు: రాజాసింగ్
X

ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏలపై ధ్వజమెత్తుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానం ఒక ‘ఫాల్త్’ తీర్మానం అని బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా బైటకు వచ్చిన రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏ దేశం వారికైనా ఆశ్రయం కల్పించి వారికి పౌరసత్వం ఇవ్వడానికి మనదేశం ‘అనాథాశ్రమం’ కాదని అన్నారు. ప్రతి పదేళ్ళకోసారి జనాభాలెక్కలుసహా పలు సర్వేలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుందని, వివరాలు ఇవ్వడం ఒక బాధ్యతగానే ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు తాను కూడా వివరాలను ఇచ్చానని గుర్తుచేశారు. ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ లాంటివాటపై స్పష్టత లేదని, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం స్వయంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని, అయితే అందులో తనకు తగిన క్లారిటీ లేదని అంటే, దానిపై సీఎం నుంచి మౌనమే సమాధానమైందని అన్నారు.

నిజానికి ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏ వల్ల దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, దళితులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏకంగా గంటసేపు మాట్లాడారని, తనకు మాత్రం స్పీకర్ కనీసం పావుగంట సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పార్లమెంటు వేదికగా ఈ అంశాల గురించి చాలా స్పష్టమైన హామీ ఇచ్చినా కేంద్రం నుంచి క్లారిటీ లేదని సీఎం తన తీర్మానంలో వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. జీవితకాలంలో 80 వేల పుస్తకాలు చదివానంటూ గొప్పగా చెప్పుకునే సీఎం కేసీఆర్, సీఏఏ గురించి అర్థం చేసుకోలేకపోయారా అని ప్రశ్నించారు.

మజ్లిస్ పార్టీని మిత్రపక్షమని గర్వంగా చెప్పుకునే కేసీఆర్ కేవలం ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఖుషీ చేయడం కోసమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నిజానికి ఈ మూడింటికీ ఒకదానితో మరోదానికి సంబంధమే లేదని అన్నారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం అన్నీ ఒకటేననే భ్రమలు కల్పించడానికి, మరింత గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అసెంబ్లీలో తనకు తగిన అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కారని అన్నారు.

tags : Rajasingh, BJP, MLA, Telangana, Assembly, NPR, NRC, CAA

Advertisement

Next Story