‘జగన్ సాధారణ మానవులతో మాట్లాడరు’

by  |
‘జగన్ సాధారణ మానవులతో మాట్లాడరు’
X

దిశ ఏపీ బ్యూరో: జగన్ సాధారణ మానవులతో మాట్లాడరని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వైఎస్సార్సీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న రఘురామకృష్ణం రాజు తాజాగా మాట్లాడుతూ, తనకు సెక్యురిటీ ఇస్తేనే నియోజకవర్గంలో పర్యటించగలనని అన్నారు. పది రోజుల్లో తాను జనం ముందుకు వస్తానని ఆయన చెప్పారు. తనను విమర్శిస్తున్న వారి వెనక ఎవరున్నారన్నది జగద్విదితమని పేర్కొన్నారు. పార్టీలో చిన్న, పెద్ద నాయకులెవరూ తనతో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు తనతో మాట్లేడేందుకే భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

తన గెలుపులో 90 శాతం జగన్, వైఎస్ ఉంటే, పది శాతమే తన సొంత ప్రతిభ అని, దానితోనే గెలిచానని చెప్పారు. ప్రచారంలో పార్టీ అధ్యక్షుడి బొమ్మనే పెట్టుకుంటామన్న ఆయన, వద్దంటే మానేస్తాం కదా? అని పేర్కొన్నారు. పదేపదే ఈ బొమ్మల గోల తేవొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రచారంలో చంద్రబాబో, మాయావతి బొమ్మలో పెట్టుకోము కదా అని ఆయన పేర్కొన్నారు. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా నియోజకవర్గానికి వెళ్తానని ఆయన చెప్పారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంత్యుత్సవాల సందర్భంగా తెలంగాణ తరహాలో ఏపీలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. పీవీ తెలంగాణలో పుట్టినప్పటికీ నంద్యాల నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని ఆయన గుర్తు చేశారు.

దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడిని గౌరవించకుందామని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలు కూడా సీఎంకి లేఖలు రాయాలని ఆయన సూచించారు. అంతే కాకుండా పీవీకి భారతరత్నకు కూడా సిఫారసు చేయాలని ఆయన అన్నారు. దీనికి ఎంపీలుగా తామంతా కృషి చేస్తామని చెప్పారు. తెలుగు జాతి ముద్దుబిడ్డను భారతరత్నతో గౌరవించుకొనేలా చేసుకుందామని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed