కాంగ్రెస్‌లోకి సార‌య్య ఖాయ‌మే.. ఎన్నిక‌ల త‌ర్వాత చేరిక‌కు ఎమ్మెల్సీ ప్లాన్‌

by Disha Web Desk 23 |
కాంగ్రెస్‌లోకి సార‌య్య ఖాయ‌మే.. ఎన్నిక‌ల త‌ర్వాత చేరిక‌కు ఎమ్మెల్సీ ప్లాన్‌
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ నుంచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ తూర్పు నుంచి మేయ‌ర్ గుండు సుధారాణి కాంగ్రెస్ గూటికి చేరుకోగా, తాజాగా మాజీమంత్రి, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య సైతం హ‌స్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు విశ్వ‌సనీయంగా తెలిసింది. రెండు రోజుల క్రితం ఆయ‌న రాజ‌కీయ గురువు రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డిని ఖ‌మ్మంలో క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి త‌న‌యుడు ర‌ఘురామ‌రెడ్డి ఖ‌మ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. ర‌ఘురాంరెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఎంట్రీ ఇచ్చిన నేప‌థ్యంలో ఆయ‌నకు అభినంద‌న‌లు తెల‌ప‌డానికే సురేంద‌ర్ రెడ్డిని ఖ‌మ్మంలో క‌లిసిన‌ట్లుగా సార‌య్య చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీలో చేరిక‌కు ప్లాన్ కూడా జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

సార‌య్య ట‌చ్‌లో ఉన్న‌ట్లుగా చాన్నాళ్లుగా టాక్‌..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కూడా ఎమ్మెల్సీ సార‌య్య సొంత‌గూటికి చేరుకుంటాడ‌నే గుస‌గుస‌లు వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లు ప్ర‌చారమూ సాగుతోంది. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారిమంత్రిగా ప్రాతినిధ్యం వ‌హించిన బ‌స్వరాజు సార‌య్య 2016లో అప్ప‌టి టీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లారు. టీఆర్ ఎస్ పార్టీలోనూ ఆయ‌న‌కు స‌ముచిత స్థానం ల‌భించింది. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఆయ‌న‌కు ఎమ్మెల్సీ నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చి టీఆర్ఎస్ న్యాయం చేసింది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవ‌డం, జిల్లాలోనూ స‌మీప భ‌విష్య‌త్‌లో కోలుకుంటుంద‌న్న న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోవ‌డంతో సార‌య్య అనుచ‌రులు పార్టీ మారాల‌ని ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన కొద్దిరోజుల నుంచి స్వ‌యంగా కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంలోని పెద్ద లీడ‌ర్లు సార‌య్య‌ను పార్టీలోకి ఆహ్వానించినా.. ఆచితూచి...వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎన్నిక‌ల త‌ర్వాతే చేరిక‌..!

రాజ‌కీయ దిగ్గ‌జం, కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత సీనియ‌ర్‌గా ఉన్న రామ స‌హాయం సురేంద‌ర్ రెడ్డి శిష్యుడైన సార‌య్య ఖ‌మ్మం జిల్లాలోని మ‌రో నేత‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు సైతం అత్యంత స‌న్నిహితుడు కావ‌డం గ‌మ‌నార్హం. 2016లో తుమ్మ‌ల చొర‌వ‌తోనే సార‌య్య టీఆర్ ఎస్ పార్టీలో చేరిన‌ట్లుగా ఆయ‌న స‌న్నిహితులు గుర్తు చేస్తున్నారు. ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్సీగా ఉన్న సార‌య్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం దాదాపుగా ఖాయ‌మ‌న్న అభిప్రాయం ఆయ‌న అనుచ‌రులు, స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత గులాబీకి గుడ్ బై చెప్పి.. సొంత‌గూడు హ‌స్తం పార్టీలోకి చేరుకుంటార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కీల‌క నేత‌గా ఎదిగిన బీసీ నేత సార‌య్య‌.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పార్టీలో ప్రాధాన్యం, రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై మ‌రింత స్ప‌ష్ట‌త తీసుకున్నాకే.. ముందడుగు వేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. సార‌య్య నిర్ణ‌యం, రాజ‌కీయ అడుగులు ఎలా ప‌డ‌బోతున్నాయ‌నేది మ‌రికొద్దిరోజుల్లో తేలిపోనుంది.



Next Story

Most Viewed