‘పుట్ట’ను రక్షించేది సీఎం వ్యాఖ్యలేనా..?

by srinivas |
‘పుట్ట’ను రక్షించేది సీఎం వ్యాఖ్యలేనా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పేరు చేర్చకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో రెండో సారి ఆయనను విచారించిన పోలీసు అధికారులు బలమైన సాక్ష్యాలు లేవన్న కారణంతోనే ఛార్జిషీట్‌లో పేరు నమోదు చేసే అవకాశాలు లేవని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.

ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోవడమేనా?

ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద జరిగిన జంట హత్య కేసులో బాధితుల కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో పేర్లు ఉన్న వారందరిపైనా కేసు పెట్టారు. నిందితులను పట్టుకున్న తర్వాత ఫిర్యాదులో లేని పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో వారందరిపైనా కూడా కేసు నమోదైంది. మొదట ఏ1గా ఉన్న రిటైర్డ్ ఇంజినీర్ వెల్ది వసంతరావు కాస్త ఏ7 అయ్యారు. అయితే, కేసులో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పేరు మొదటి ఫిర్యాదులో రాయలేదని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. ఆ తర్వాత 164 స్టేట్ మెంట్‌‌లో కూడా పుట్ట మధు, శైలజలకు పరోక్ష సంబంధం ఉందని చెప్పారు. ఏప్రిల్‌లో వరంగల్ ఐజీకి రాసిన లేఖలో కూడా పుట్ట మధుతో పాటు పలువురి పేర్లను కిషన్ రావు ప్రస్తావించారు. తన కొడుకుది పక్కా సుపారీ మర్డరేనని కూడా ఐజీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పుట్ట మధు అదృశ్యం పోలీసులు అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించారు. అయితే పుట్ట మధుకు ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదన్న నిర్దారణకు పోలీసు అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో పుట్ట మధు పేరు లేకపోడం వల్లే ఆయన పేరును చేర్చడం అసాధ్యమన్న సంకేతాలను ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక పోలీసు అధికారులు చెప్పినట్టుగా సమాచారం. దీంతో దాదాపుగా ఈ కేసులో పుట్ట మధుకు ప్రమేయం లేనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి పోలీసు వర్గాలు.

సీఎం వ్యాఖ్యలు కీలకం…

వామన్ రావు హత్య గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమధానం ఇస్తూ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారని, రిటైర్డ్ ఇంజినీర్ వసంతరావును కూడా అరెస్ట్ చేశారన్నారు. ఇందులో ప్రముఖలు ప్రమేయం ఏమాత్రం లేదన్నట్టుగా సీఎం మాట్లాడారని ఇప్పుడు మరికొందరి పేర్లు చేర్చితే సరికాదన్న చర్చ కూడా జరిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని చెప్పిన తరువాత ఇప్పుడు మరి కొందరి పేర్లు చేర్చడం వల్ల ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకున్నట్టవుతుందని దీంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని కూడా చెప్పినట్టు సమాచారం. దీంతో గట్టు వామన్ రావు హత్య కేసును ఛార్జిషీటును వీలైనంత త్వరగా వేసి ఆరోపణలకు, విచారణలకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం.

Advertisement

Next Story

Most Viewed