ప్రిఫర్ ఖాదీ.. జీన్స్, టీషర్ట్స్‌ వద్దంటే వద్దు!

by Shamantha N |   ( Updated:2021-02-12 11:29:08.0  )
ప్రిఫర్ ఖాదీ.. జీన్స్, టీషర్ట్స్‌ వద్దంటే వద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్ర్యానికి ముందు ఖాదీ వస్త్రాలకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం లేకుండా పోయింది. ఫ్రీడమ్ ఫైట్ సమయంలో విదేశీ వస్ర్త బహిష్కరణకు మహత్మాగాంధీ ఇచ్చిన పిలుపు ఆనాడు బాగా పనిచేసింది. దీంతో నాటి భారతీయులు ఖాదీ, దేశీయంగా తయారైన దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.1947లో స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా దేశీయ వస్త్ర తయారీ పరిశ్రమ కొన్నేండ్లు బాగానే ఉంది. 1991లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక సంస్కరణలు అమలయ్యాక.. క్రమక్రమంగా దేశంలో విదేశీ కల్చర్ బాగా పెరిగిపోయింది. స్వేచ్ఛాయుత వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలు భారతీయ వస్త్ర పరిశ్రమపై తమ ఆధిపత్యాన్ని కనబరిచాయి. అప్పటి వరకు చీరలు, పంచలు కట్టుకున్న భారత ప్రజలు నెమ్మదిగా విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలోనే టీషర్ట్స్, జీన్స్, షర్ట్స్ వంటి ప్రొడక్ట్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దేశంలో విదేశీ కంపెనీల పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇండియన్ మార్కెట్‌పై బడా పారిశ్రామిక వేత్తలు కన్నెశారు. దీంతో నాటి నుంచి నేటీకి ఖాదీ వస్త్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఖాదీ పరిశ్రమకు కొంత ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మేక్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారైన వస్తువులు, దుస్తులను వినియోగించాలని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం ప్రారంభించడంతో కొంతమేర ప్రజల్లో మార్పు వస్తోంది. స్వయంగా ప్రధాని మోడీతో సహా సినీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, మీర్జాపూర్ ఫేం పంకజ్ త్రిపాటి, భూమి పడ్నేకర్, మోహన్ లాల్ వంటి నటులు ఖాదీ ఉత్పత్తులకు ప్రచారం చేయడం కూడా గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కలిసొచ్చే అంశం. ఇండియాలో ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘పాలి’ ఖాదీ వస్త్రాలు ఉపయోగిస్తే.. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ‘ఉలన్’ ఖాదీని వాడుతున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఖాదీ ఉత్పత్తుల ప్రొడక్షన్ రన్ అవుతోంది. 2017 లెక్కల ప్రకారం.. ఖాదీ ఉత్పత్తి రంగంలో దేశవ్యాప్తంగా 4,60,000 మంది కార్మికులు పనిచేస్తుండగా, అదే ఏడాది ఖాదీ అమ్మకాలు 31.6% నుంచి 33% పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ ఉత్పత్తుల సేల్స్ 28 శాతం పెరిగి రూ.3,215 కోట్ల లాభాలు ఆర్జించినట్లు కేంద్ర గణాంకాలు సైతం వెల్లడించాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశీయ ఖాదీ రంగాన్ని ప్రోత్సహించడానికి పలు చర్యలకు ఉపక్రమించాయి. రాజస్థాన్‌లో ఖాదీ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ప్రత్యేకంగా స్పెషల్ ఇనిస్టిట్యూషన్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా, అవి రుణాలు పొందడానికి రూ.10కోట్ల ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేశారు. యూపీ సైతం ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి ఆన్‌లైన్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్టుతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 40 రకాల ఉత్పత్తులను షార్ట్ లిస్ట్ చేసి.. 30శాతం డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఖాదీ దుస్తులు ధరించాలని రూల్స్ పెట్టింది. తాజాగా పూణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఎంప్లాయిస్‌‌కు డ్రెస్‌కోడ్‌ పెట్టడమే కాకుండా.. జీన్స్, టీషర్ట్స్, స్లిప్పర్‌లను ఆఫీసుకు వేసుకుని రావడాన్ని శాశ్వతంగా నిషేధించింది. అంతేకాకుండా, వారంలో ఒకరోజు తప్పకుండా ఖాదీ దుస్తులు ధరించాలని అడిషనర్ మున్సిపల్ కమిషనర్ రుబాల్ అగర్వాల్ స్పష్టంచేశారు. ఉద్యోగులు డ్రెస్‌కోడ్ ధరించడం వలన ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వ్యక్తులకు మంచి అభిప్రాయాన్ని కలిగించడమే కాకుండా, ప్రాధాన్యతను, వర్కింగ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేస్తుందన్నారు. ఇదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశీయ ఉత్పత్తి రంగం అభివృద్ధి చెంది.. దేశ ఆర్థికాభివృద్ధి పెరుగుదలకు దోహదపడుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తు్న్నారు.

Advertisement

Next Story