టెక్ మహీంద్రాకు చెక్!

by Shyam |
టెక్ మహీంద్రాకు చెక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కంపెనీకి పుణె లేబర్ కమిషనర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో నష్టాలను అధిగమించేందుకు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తోందని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్(ఎన్ఐటీఈఎస్) ఫిర్యాదు చేసింది. కంపెనీకి చెందిన ఉద్యోగులు వారం క్రితం వేతనాల కోతకు సంబంధించి మెయిల్స్ అందుకున్నారని, మే 1 నుంచి షిఫ్ట్ అలవెన్స్‌లు రూ. 5000 నుంచి రూ. 10,000 మధ్య నిలిపివేశారని ఈ-మెయిల్స్‌లో ఉన్న సారాంశమని ఆ ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో 13 వేల మంది ఉద్యోగులపై ప్రభావం ఉంటుందని, ఇది మానవహక్కుల ప్రాథమిక విధానాలను పాటించడంలో విఫలమైనట్టు అవుతుందని పేర్కొంది. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని ఎన్ఐటీఈఎస్ తెలిపింది. లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులను తొలగించకూడదనే కేంద్రం నిర్ణయాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. పుణె టెక్ మహీంద్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేసింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వేతనాలు, ఉద్యోగాల కోతపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నట్టు ఎన్ఐటీఈఎస్ వ్యవస్థాపకుడు రఘునాథ్ స్పష్టం చేశారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయమై టెక్ మహీంద్రా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. కార్యాలయానికి వస్తున్నా, క్లయింట్ల వద్దకు వెళ్తున్నా వారికి షిఫ్ట్ అలవెన్స్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలోనే టెక్ మహీంద్రా ఐదో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ. మొత్తం 1,25,000 మంది ఉద్యోగుల్లో 10 శాతం కంటే ఎక్కువ మంది పుణె హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

నెల రోజుల క్రితం ఇదే సంస్థ విప్రో కంపెనీపై కూడా ఇలాంటి ఫిర్యాదే చేసింది. ఇంతకుముందు ఆ సంస్థ 300 మంది ఉద్యోగులను బెంచ్‌కి పరిమితం చేయడం, వేతనాల్లో కోత విధించినందుకుగాను ఫిర్యాదులొచ్చాయి. అయితే, ఈ ఫిర్యాదుల గురించి వార్తలను విప్రో కొట్టి పారేయడం విశేషం. ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి, కొత్త అసైన్‌మెంట్ల కోసం ఉన్నవారికి వేతనాలు, ఉద్యోగాల్లో కోత లేదని విప్రో స్పష్టం చేసింది. ఉద్యోగుల కోసం తమ సంస్థ కచ్చితమైన విధానాలను రూపొందించుకుందని వెల్లడించింది. పుణెకు చెందిన ఓ టెక్ కంపెనీ 150 మంది ఉద్యోగులను తొలగిస్తుందనే వార్తతో టెక్ మహీంద్రాపై ఈ ఫిర్యాదు అందిందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed