గ్రేటర్ హైదరాబాద్‌లో బహిరంగ దోపిడీ

by Anukaran |
గ్రేటర్ హైదరాబాద్‌లో బహిరంగ దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా బహిరంగ దోపిడీకి తెరతీసింది. పార్కింగ్ పేరిట వసూళ్ల దందా చేపడుతోంది. నగరంలో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజు రెగ్యులరేటరీ చట్టాన్ని అమలు చేయనున్నట్టు బల్దియా తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. అయితే పబ్లిక్ ప్రదేశాల్లోనూ, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ పార్కుల్లో, ప్రార్థన మందిరాల్లో పార్కింగ్ ఫీజు పేరుతో దోపిడీ చేస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజులను రెగ్యులరేట్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 2018లో విడుదల చేసిన జీఓ 63ను పకడ్బందీగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.50 వేల జరిమానా విధించేందుకు సిద్ధమైంది.

ఈ బాధ్యతలను బల్దియా విభాగమైన ఈవీడీఎంకు అప్పగించింది. ప్రైవేట్ సంస్థలు చేస్తున్న పార్కింగ్ దోపిడీని అరికట్టేందుకు నగరమంతా ఒకే విధమైన పార్కింగ్ రసీదులను కూడా ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కమర్షియల్ భవనాల వరకూ బాగానే ఉన్నా ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ స్థలాల్లోనూ పార్కింగ్ ఫీజుల దందాపై జీహెచ్ఎంసీ స్పందించడం లేదు. వివిధ పనుల కోసం బల్దియా కార్యాలయాలకు వస్తున్న ప్రజల నుంచి కూడా పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పరిధిలోని పర్యాటక స్థలాల్లోనూ పార్కింగ్ దందాతో సాధారణ ప్రజలు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కుటుంబంతో సహా సరదాగా గడుపుదామని పార్కులు, పబ్లిక్ ప్రదేశాలకు వచ్చిన సిటీజన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో వెహికల్ పార్కింగ్ చార్జీలు చెల్లించక తప్పడం లేదు.

నగరంలోని ఎన్టీఆర్, లుంబినీ పార్కుల్లోనూ పెయిడ్ పార్కింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ ప్రజలకు సేవలందించే ప్రధాన ప్రభుత్వ విభాగాల్లో ఒకటైన హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కులో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండడం గమనార్హం. నగరంలోని పలు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో పనుల కోసం వస్తున్న వారి వాహనాల కోసం పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ భవనాల్లో పార్కింగ్ ఫీజుల కోసం రూల్స్ అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ పబ్లిక్ ప్రదేశాల్లో కూడా పార్కింగ్ ఫీజుల పేరుతో దండుకోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని కార్యాలయాలు, పార్కుల్లోనూ స్వయంగా ఆ సంస్థలే పార్కింగ్ దందాకు తెరలేపడం విడ్డూరంగా ఉంది. కుటుంబాలతో సేద తీరుదామనుకున్న నగర పౌరులకు ఆస్పత్రులు, దేవాలయాలు, ప్రభుత్వ పార్కుల వద్ద కూడా పార్కింగ్ దందా పలకరిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, పార్కులు కమర్షియల్ పరిధిలోకి రాకున్నా వెహికిల్స్ కోసం చార్జి చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కమర్షియల్ వ్యాపారుల నుంచి ప్రజలను రక్షించేందుకు పార్కింగ్ ఫీజు రెగ్యులరేటరీ చట్టాన్ని అమలు చేయడమనేది ఆహ్వానియమే.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని స్వంత ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రదేశాల్లోని పార్కింగ్ దందాకు బ్రేక్ పడాల్సి ఉంది. ప్రభుత్వ పార్కులు, ఆస్పత్రులు, కార్యాలయాల వద్ద కూడా పార్కింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సేవలు అందించాల్సిన స్థలాల్లోనూ కమర్షియల్ భవనాలుగా మార్చి పార్కింగ్ వసూలు చేయడమేమిటని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పార్కులు, దేవాలయాల వద్ద రెచ్చిపోతున్న పార్కింగ్ మాఫియాను అరికట్టాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడం ఆయా విభాగాల పని తప్ప ప్రజల మీద ఆర్థిక భారాన్ని వేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed