- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండుగకంటే ప్రాణం ముఖ్యం
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు నెలల కరోనా అనుభవం తెలంగాణకు చాలా నేర్పిందని, ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చేయలేని పనిని కరోనా వైరస్ చేసి చూపించిందని, అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితే నిదర్శనమన్నారు. సీజనల్ వ్యాధుల్ని తగ్గించిందని, అంటువ్యాధుల్ని నివారించిందని, గాలి-నీరు ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టగలిగిందని, ప్రజలకు స్వీయ క్రమశిక్షణను అలవాటు చేసిందని, పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజేసిందని.. ఇలా ఎన్నో నేర్పిందని వివరించారు. అన్‌లాక్-5.0 ద్వారా ఒకటి రెండు మినహా ఆంక్షలన్నీ సడలిపోయినా బతుకమ్మకు మాత్రం ఎందుకు కొత్తగా ఆంక్షలు పెట్టాల్సి వస్తుందో వృత్తిపరంగా వైద్యుడైన డాక్టర్ శ్రీనివాసరావు ‘దిశ’కు వివరించారు. పండుగ కంటే ప్రాణాలు ముఖ్యమన్నారు. త్వరలో ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగించేందుకు క్యాంపెయిన్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రశ్న: బతుకమ్మకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నట్లు?
జవాబు: నిర్దిష్టంగా ఒక పండుగ కోసం పెట్టిన ఆంక్షలు కావు. ఇక నుంచి వరుసగా వివిధ మతాల పండుగలు వస్తూనే ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి వరకూ పండుగ సీజనే. అప్పటిదాకా ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం. అన్‌లాక్-5.0 సడలింపులను పండుగలతో ముడిపెట్టలేం. పండుగల్లో ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను గాలికొదిలేస్తారు. మనకు వచ్చే పాజిటివ్ కేసుల్లో దాదాపు 70% ఎలాంటి లక్షణాలు లేనివే. వందల సంఖ్యలో జనం గుమిగూడతారు. వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది.
ప్ర: ఇది పండుగలకు మాత్రమే పరిమితమా?
జ: కాదు. పర్యాటక ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అయిన తర్వాత వందలాది మంది అక్కడ గుమికూడారు. జనం పోగైతే అది వైరస్ వ్యాప్తికి దారితీస్తుంది. అందుకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం.
ప్ర: షాపింగ్ మాల్స్, బార్లు, క్లబ్‌లకు లేని ఆంక్షలు ఇప్పుడెందుకు?
జ: షాపింగ్ మాల్స్ దగ్గర సెక్యూరిటీ, లేదా నిర్వాహకుల ద్వారా నియంత్రణ ఉంటుంది. అలాగే క్లబ్‌లు, బార్‌లు.. లాంటివి కూడా. కానీ ఊరేగింపులు, మీటింగులు, బతుకమ్మ లాంటి వాటి దగ్గర స్వీయ నియంత్రణే ఎక్కువ అవసరం. పండుగ ఉత్సాహంలో బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తాం. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారికి వైరస్ ఉందో లేదో తెలియదు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వైరస్ వ్యాప్తి చెందడం ఖాయం. అందుకే ముందుజాగ్రత్తలు.
ప్ర: ఇది పండుగ మీద పెట్టిన ఆంక్షలు కావా?
జ: పండుగ కంటే ప్రాణం ముఖ్యం. పండుగలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ ప్రాణం అలా కాదు. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్లుగా మారకూడదు పరిస్థితి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెడుతున్న నియంత్రణే తప్ప నిషేధం కాదు. ఈ వారంలోనే విస్తృతంగా క్యాంపెయిన్‌లు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం.
ప్ర: పండుగతో అంత భయపడుతున్నారెందుకు?
జ: కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత అక్కడ తీసుకున్న పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. తాజాగా ఓనం పండుగ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు పటిష్టంగా అమలుకాకపోవడం, ఇటు ప్రజల్లో స్వీయ నియంత్రణ లేకపోవడంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. వైరస్ వ్యాప్తిని అదుపు చేయడం కష్టమైపోయింది. చివరకు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినా రోజుకు పది వేల కంటే ఎక్కువ కేసులే నమోదవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో జాగ్రత్త పడుతున్నాం.
ప్ర: ఇమ్యూనిటీ పెరిగింది గదా!
జ: వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయినవారిలో ఇమ్యూనిటీ పెరిగిందనేది ఒక రకంగా నిజమే. అది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. ఇలా అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుంది. కానీ అక్కడ కూడా కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతూ ఉన్నాయి. ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీని మనం ఎక్కువగా ఊహించుకోకూడదు. అదే సర్వస్వం అయితే కేరళలో ఓనం పండుగ తర్వాత కేసులు ఎందుకు పెరిగాయి. వారిలో ఇమ్యూనిటీ బాగానే ఉంది గదా! నిజానికి ఇమ్యూనిటీ అంశం కంటే ప్రజలు శుభ్రంగా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం, కొవిడ్ నిబంధనలను పాటించడం వైరస్ బారిన పడకుండా కాపాడాయి. ఇమ్యూనిటీ మీదనే పూర్తి భారం వేసి నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు.
ప్ర: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నిజంగానే తగ్గిందా?
జ: తొలి రోజుల్లో మనం టెస్టులు తక్కువ చేశాం. పాజిటివ్ కేసులు ఎలా వచ్చాయో చూశాం. ఆ తర్వాత టెస్టులు పెంచాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కనిపిస్తూనే ఉంది. గణాంకాలను చూస్తే పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోయింది. ప్రజల్లో పెరిగిన క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ప్రభుత్వం వ్యవహరించిన తీరు మంచి ఫలితాలను ఇచ్చాయి. వైరస్ వ్యాప్తి తగ్గకపోతే ఇతర రాష్ట్రాల్లో వచ్చినట్లు వేల సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ప్రజలు బెంబేలెత్తిపోయే వాతావరణం ఉండేది. ఇప్పుడు జిల్లాల్లో సైతం అదుపులోకి వచ్చిందని స్పష్టంగా కనిపిస్తోంది.
ప్ర: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికీ వందల్లోనే కేసులొస్తున్నాయిగదా!
జ: జనం గుమికూడిన చోట్ల వైరస్ వ్యాప్తి చెందుతోందనేది వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్‌లో లేదా పక్కనున్న ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదుకావడానికి కారణం జన సాంద్రత. ఎక్కడ జనం ఎక్కువగా ఉంటున్నారో అక్కడే పాజిటివ్ కేసులొస్తున్నాయి. అందుకే మనం కంటైన్‌మెంట్ విధానాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నాం. దీనివల్లనే ఆ ప్రాంతాలకు మాత్రమే వైరస్ పరిమితమైంది తప్ప ఇతర చోట్లకు వ్యాపించలేదు. జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నమోదుకాకపోవడానికి జన సాంద్రత తక్కువగా ఉండడమే ప్రధాన కారణం.
ప్ర: బతుకమ్మ సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి?
జ: పండుగేగానీ, మీటింగేగానీ జనం ఎక్కువగా పోగయ్యేచోట వీలైనంత ఎక్కువ దూరంలో ఉండాలి. మొదటినుంచీ నొక్కిచెప్తున్నట్లుగానే మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఇవి ప్రభుత్వ ఆంక్షలు, నిబంధనలు, నియంత్రణలు అనేదాంతో సంబంధం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సినవి. వీటిపట్ల మనం ఎంత సీరియస్‌గా ఉంటే వైరస్ వ్యాప్తి నుంచి అంత సురక్షితంగా ఉన్నట్లు లెక్క. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరికొంతకాలం జనంతో కలవకుండా దూరం మెయింటెయిన్ చేయడం ఉత్తమం.
ప్ర: వ్యాక్సిన్ వస్తే ఈ స్వీయ నియంత్రణలు అవసరం లేదేమో!
జ: వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అది ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందో, దాని సామర్థ్యం ఎంతో, ఫలితాలు ఎంత వేగంగా ఉంటున్నాయో.. ఇవన్నీ చూడకుండా దానిపైనే భారం వేయలేం. దాని పనితీరుపై స్పష్టమైన శాస్త్రీయ ఫలితాలు వచ్చేంతవరకు ఈ మూడు నిబంధనలే అద్భుతమైన వ్యాక్సిన్. అందుకే సందర్భాలతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ మూడు నిబంధనలను పాటిస్తే అంతకుమించిన వ్యాక్సిన్ లేదు.