తూచ్.. ఆ హామీ ఉత్తుత్తిదే..!

by Shyam |
తూచ్.. ఆ హామీ ఉత్తుత్తిదే..!
X

దిశ, కాప్రా: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికి జమ్మిగడ్డ హిందూ శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజల్ని వంచించ చూస్తున్నారని 2, 3వ డివిజన్లకు చెందిన ప్రజలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నాటి ఉమ్మడి ఏపీ లో జమ్మిగడ్డ ప్రజల అభ్యర్థన మేరకు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవేందర్ గౌడ్ మినీ స్టేడియం నిర్మాణానికి సర్వే నెం.199లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు తమకున్న పలుకుబడితో నాలుగు ఎకరాల స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుని అన్యాక్రాంతమైంది.

కాగా, మిగిలిన ఎనిమిది ఎకరాల స్థలంలో మూడు ఎకరాలు జమ్మిగడ్డ హిందూ శ్మశానవాటికకు కేటాయించాలని గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోరగా స్థానిక శాసనసభ్యుడు, 2, 3 డివిజన్ల కార్పొరేటర్లు మేయర్ బొంతు రామ్మోహన్, పావని రెడ్డి గ్రేటర్ ఎన్నికల సమయంలో శ్మశానవాటికకు పెన్సింగ్ వేయించి ఓట్లు దండుకున్నారు. అనంతరం ఎన్నికలు ముగియగానే ఇచ్చిన హామీని గాలికి వదిలి పెన్సింగ్ కూడా తొలగించారని ఆయా బస్తీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ల పునర్విభజనలో భాగంగా జమ్మిగడ్డ ప్రాంతం 2, 3వ డివిజన్లలో ఉండగా అధిక శాతం ఓటు బ్యాంకు ఈ 2 కాలనీలు, మురికివాడలు, బస్తీల్లో ఉన్నాయి. దీంతో మరోసారి ప్రజలకు మాయమాటలు చెప్పి సునాయాసంగా ఎన్నికల్లో విజయం సాధించొచ్చనే ఆశతో అధికార పార్టీ నాయకులు హిందూ శ్మశానవాటికను తెరపైకి తీసుకొస్తున్నారని ఆ బస్తీల ప్రజలు విమర్శిస్తున్నారు. అనేకమార్లు ఉద్యమాలు చేసినా ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖం చాటేస్తూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు, మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ పావని రెడ్డి శ్మశాన వాటిక నిర్మాణం కోసం కొత్త పల్లవిని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు.

లబ్ధి పొందేందుకే…

అనధికారికంగా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి పావులు కదుపుతూ కొబ్బరికాయల తంతు ముందుకు తీసుకొచ్చారని ఆ డివిజన్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజా సమస్యలను ఏ రోజు పట్టించుకోలేదని, తన వద్దకు వచ్చిన ప్రజా సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో ముంపు ప్రాంత బాధితులను పలకరించకపోగా వరద సాయాన్ని సైతం అందించలేదని పలు బస్తీల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చోటా మోటా నాయకులు, కార్యకర్తలు వరద నిధుల్ని పక్క దారి పట్టించారని చర్లపల్లి డివిజన్ లోని కాలనీలవాసులు వాపోయారు. ఎస్ రావునగర్ రెండో డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన పావని రెడ్డి డివిజన్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలు, సమావేశాలకు పరిమితమయ్యారని, ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలోనూ వీరిరువురు విఫలమయ్యారని అంటున్నారు. ఈ డివిజన్లలో వీరు చేసిందేమి లేదని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed