న‌గ‌ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ముంపు బాధితులు

by Shyam |
న‌గ‌ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ముంపు బాధితులు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్, తెలంగాణ బ్యూరో: ముంపు సాయం అందలేదని గ్రేటర్ ప్రజలు రోడ్లెక్కారు. తక్షణ సాయాన్ని హఠాత్తుగా ఆపివేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇళ్లు, కార్యాలయాలను ఎక్కడికక్కడ ముట్టడించారు. ఇస్తామన్న రూ.10 వేల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. ప్రజల ఆందోళనలో నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ కార్యాలయా వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వరద ముంపు సాయం కోసం బాధితులు తండ్లాడుతూనే ఉన్నారు. రోడ్లెక్కినా.. ఆందోళనలు చేసినా సాయం అందక కన్నీరు పెట్టుకుంటున్నారు. స్థానిక నాయకులు పరిహారం అందించడానికి ముప్పుతిప్పలు పెడుతూ.. మూడుచెరువుల నీళ్లు తాగిస్తున్నారు. గ‌త నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌తో గ్రేట‌ర్ ప‌రిధిలోని సుమారు 1,500 కాల‌నీలు నీట మునుగ‌గా వేలాది కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం స్పందించి వ‌ర‌ద ముంపు బాధితుల‌ కోసం రూ .550 కోట్ల నిధుల‌ను ఆర్థిక స‌హాయం కింద విడుద‌ల చేసింది. వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌ను గుర్తించి ప్రతి కుటుంబానికీ రూ 10 వేలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. నిధుల విడుదల అనంతరం బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయడంలోనే అక్రమాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు తమ పలుకుబడితో తమ అన్న వారికే డబ్బులు అందజేశారు. దీంతో అసలైన లబ్ధిదారులు ఎక్కడికి, ఎవరి చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రేటర్ పరిధిలోని వరద బాధితులంతా రోడ్డెక్కారు. వ‌రుస ఆందోళ‌న‌లు మొద‌ల‌వ్వడంతో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ వ‌ర‌ద స‌హాయం కింద అంద‌జేసే మొత్తాన్ని తాత్కాలికంగా వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ముంపు బాధిత కుటుంబాల్లో మరింత ఆగ్రహావేశాలను పెంచింది.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

వ‌ర‌ద ముంపునకు గురై తిన‌డానికి తిండి కూడా లేకుండా ప‌స్తులుంటున్న త‌న కుటుంబానికి ప‌రిహారం అంద‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ గోల్నాక వ‌డ్డెర‌బ‌స్తీకి చెందిన వెంక‌టేశ్(45) శ‌నివారం అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్ ఇంటి వద్ద కిరోసిన్తో ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు గుర్తించి అత‌ని నుంచి కిరోసిన్ బాటిల్ ను లాక్కున్నారు. అంతేకాకుండా వంద‌ల సంఖ్యలో ప‌టేల్ న‌గ‌ర్, ప్రేమ్ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన వ‌‌ర‌ద ముంపు బాధితులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని నిర‌స‌న తెలిపారు. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలోని కాచిగూడ కార్పొరేట‌ర్ ఎక్కాల చైత‌న్య, న‌ల్లకుంట కార్పొరేట‌ర్ గ‌డిగంటి శ్రీదేవి, బాగ్ అంబ‌ర్ పేట్ కార్పొరేట‌ర్ కె ప‌ద్మావ‌తి, అంబ‌ర్ పేట్ కార్పొరేట‌ర్ పులి జ‌గ‌న్ ఇళ్లను ముట్టడించారు. త‌మ‌కు వెంట‌నే ప‌రిహారాన్ని అంద‌జేయాల‌ని డిమాండ్ చేశారు.

జోన‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముట్టడి

ముంపు ప్రాంతాల ప్రజలకు ప‌రిహారం అంద‌క‌పోవ‌డంతో న‌గ‌రంలోని ప‌లు చోట్ల జీహెచ్ఎంసీ కార్యాల‌యాలు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్, కార్పొరేట‌ర్ల ఇళ్లను ప్రజలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న‌లు తెలిపారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖైర‌తాబాద్ లోని జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని తెల్లవారుజాము నుంచే నాంప‌ల్లి, మ‌ల్లేప‌ల్లి, ఆగాపురా, చిత్రంబాగ్ త‌దిత‌ర బ‌స్తీల ప్రజలు ముట్టడించారు. వందలాదిగా ప్రజలు తరలివచ్చి కార్యాల‌యం ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డుపై కూర్చుని ధ‌ర్నాకు దిగారు. దీంతో కిలోమీట‌ర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ సంద‌ర్భంగా కోమ‌టిబ‌స్తీ, మ‌ల్లేప‌ల్లి, మాంగార్ బ‌స్తీ, అఫ్జల్ సాగ‌ర్, రెడ్ హిల్స్, సీతారాంబాగ్ బోయిగూడ త‌దిత‌ర బ‌స్తీల‌కు చెందిన ప్రజలు మాట్లాడుతూ.. ప‌రిహారం ఇచ్చేందుకు తమ దగ్గరికి ఎవ‌రూ రాలే, ఇచ్చిన వారికే డ‌బుల్ డ‌బుల్ ఇస్తున్నారు. బంగ్లా మీద ఉన్న వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు. మధ్యలో ద‌ళారులు వచ్చి తమకు రూ.3 వేలు ఇస్తే ప‌రిహారం ఇప్పిస్తామ‌ని వ‌స్తున్నార‌ని వాపోయారు. మ‌ల్లేప‌ల్లి, సీతారాంబాగ్ లో ఒక్క కుటుంబానికి కూడా ప‌రిహారం అందలేద‌ని చెప్పారు. ఆయా ప్రాంతాల‌లో ఎంఐఎం లీడ‌ర్లు రూ.5 వేలు క‌మీష‌న్ ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ని తెలిపారు. ఎమ్మెల్యే జాఫ‌ర్ హుస్సేన్ సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. బోయిగూడ కు చెందిన సుమారు 80 ఏండ్ల వృద్ధురాలు త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బోరున విల‌పించింది.

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

వ‌ర‌ద ముంపు ప‌రిహారం అంద‌జేయ‌డంలో జ‌రుగుతున్న అక్రమాలతో విసిగివేసారిన ప్రజలు న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళ‌న బాట ప‌ట్టారు. పాత‌బ‌స్తీ మాదన్నపేట మెయిన్ రోడ్డులో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహదేవ్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధం చేశారు. దీంతో సంతోష్ న‌గ‌ర్ నుంచి చాద‌ర్ ఘాట్ వ‌ర‌కు ట్రాఫిక్ నిలిచిపోయి వాహ‌న‌దారులు ప‌డ‌రాని పాట్లు పడ్డారు. రోడ్లపై బాధిత కుటుంబాల నినాదాలు, అరుపుల‌తో ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది. పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసినప్పటికీ వారిని లెక్క చేయ‌కుండా ఆందోళన కొన‌సాగించారు. సికింద్రాబాద్ లోని డిప్యూటీ స్పీకర్ ప‌ద్మారావు ఇంటి ఎదుట వ‌ర‌ద ముంపు బాధితులు ఆందోళ‌న‌కు దిగి త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి ఇంటిని సైతం బాధితులు ముట్టడించారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ కార్యాలయాన్ని దత్తనగర్ బస్తీ వాసులు ముట్టడించి పరిహారం ఇవ్వాలని ఆందోళన చేశారు.

చందానగర్ కార్పొరేటర్ నవత రెడ్డి ఇంటిని వరద బాధితులు ముట్టడించారు. కార్పొరేటర్ అనుచరులకు, టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే రూ. 10 అందించారని ప్రజలు విమర్శించారు. వరదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కార్పొరేటర్ కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల మందితో ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి భారీగా వరద బాధితులు చేరుకున్నారు. ఉప్పల్, పటాన్‌చెరు, సరూర్‌నగర్‌, మలక్‌పేట్, చందానగర్‌, ఛత్రినాకలో బాధితుల ఆందోళనలు నిర్వహించారు. జీడిమెట్లలో బీజేపీ ఆధ్వర్యంలో, ఎల్‌బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనలు చేశారు. అధికార పార్టీ నేతలే వరద సాయాన్ని పంచుకున్నారని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు, అధికారులు కమీషన్లు తీసుకుని మిగిలిన డబ్బులను ఇస్తున్నారని ముంపు బాధితులు తెలిపారు. కార్పొరేటర్ పార్టీకి సంబంధం ఉన్న వారికి మాత్రమే వరద సాయాన్ని ఇచ్చారని ఎల్‌బీ నగర్ సీపీఎం నాయకులు కె.నర్సిరెడ్డి ఆరోపించారు.

25 శాతం కూడా అందలేదు

వ‌ర‌ద ముంపు సాయం కింద ప్రభుత్వం అంద‌జేస్తున్న ప‌రిహారం కేవ‌లం 25 శాతం బాధితుల‌కు కూడా అంద‌లేద‌ని ప‌లువురు ఆరోపించారు. అధికారులు, కార్పొరేట‌ర్లు ప్రజల పొట్టకొట్టి జేబులు నింపుకున్నారని మండిప‌డ్డారు. 20 నుంచి 25 శాతం కూడా పంపిణీ స‌క్రమంగా లేద‌ని, కొన్ని చోట్ల అధికారులు, కార్పొరేట‌ర్లు వాటాలు వేసి పంచుకున్నార‌ని మండిప‌డ్డారు.

వరద బాధితులందరికీ ప్రభుత్వ సాయం : కేటీఆర్

అర్హులైన ప్రతీ కుటుంబానికి వరద ముంపు సాయాన్ని అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ స్పందించింది. వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ సహాయం అందించామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇంకా ఆర్థిక సహాయం అందలేదని కొంతమంది చేస్తున్న విజ్ఞప్తిలు తమ దృష్టికి వచ్చాయని తెలిపిన ఆయన, ప్రతి బాధిత కుటుంబానికీ సహాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశమని విరించారు. అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందని నేపథ్యంలో వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో తక్షణ సాయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed