ఫుల్ స్పీడ్‌లో ‘ప్రైవేట్’సర్వీసులు

by Anukaran |
ఫుల్ స్పీడ్‌లో ‘ప్రైవేట్’సర్వీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ నష్టాలకు సంస్థ యాజమాన్యమే కారణమవుతోంది. ఆదాయం వచ్చే సమయాల్లో శాఖాధికారులు నిద్రమత్తులోనే ఉంటున్నారు. ముందుగా చేయాల్సిన ఏర్పాట్లను లాగుతూ ఆఖరుకు హడావుడి చేస్తున్నారు. ప్రైవేట్​ రవాణా సంస్థల కోసమే నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం సంక్రాంతి హడావుడి మొదలైంది. ఏపీకి 30 లక్షల మంది ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తారనే అంచనా. కానీ ఈ పండుక్కి మాత్రం వారిని ప్రైవేట్​ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్​ ట్రావెల్స్​ సంస్థలకు లబ్ధి చేసేందుకే ఇంకా రిజర్వేషన్లు కూడా మొదలుపెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్​ ట్రావెల్స్​ సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచాయి. నాలుగింతలు చేసి వసూలు చేసుకుంటున్నాయి.

ఫైల్​ పెండింగ్..​

సంక్రాంతి పండుగ సమయంలో బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాలు ఒప్పందంతో సాగుతుంటాయి. దీనికోసం ఎక్కువ బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాలు ముందుగానే చర్చించుకుంటాయి. ఈసారి ఏపీ 4,300 బస్సులు తిప్పేందుకు ముందుగా తెలంగాణకు లేఖ రాసింది. కానీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ లేఖపై సమాధానం పంపించలేదు. కారణాలేమైనా రిప్లై ఇవ్వలేదు. దీంతో ఏపీఎస్​ ఆర్టీసీ 3607 బస్సులను తిప్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుకింగ్​ మొదలు పెట్టింది.

బస్సులే ఖరారు చేయలేదు..

తెలంగాణ ఆర్టీసీ దీనిపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే రూట్లను ఖరారు చేసుకుని అలైటింగ్​ పాయింట్లను కూడా సిద్ధం చేసిన ఏపీ రిజర్వేషన్లలో స్పీడ్​ పెంచింది. బీహెచ్​ఈఎల్​, మియాపూర్​, నిజాంపేట్​, ప్రగతినగర్​, కేపీహెచ్​బీ, కూకట్​పల్లితో పాటు జూబ్లీ, ఉప్పల్​, ఎల్బీనగర్​, మిథాని, ఏఎస్​రావు, ఈసీఐఎల్​, నర్సాపూర్​ చౌరస్తా వంటి ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను తెరిచారు. కానీ తెలంగాణ మాత్రం ఇప్పటికీ ఇంకా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మంత్రి పువ్వాడ అజయ్​ ఈ ఫైల్​ను ఫైనల్​ చేసేందుకు సాహసించడం లేదు. అయితే 1800 బస్సులను తిప్పేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నా దీనిపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటా నాలుగువేలకుపైగా బస్సులను ఏర్పాటు చేసే ఆర్టీసీ ఈసారి ఎందుకు తగ్గిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది 4940 బస్సులు..

సంక్రాంతి ఆర్టీసీకి కీలకమైన రోజులుగా భావిస్తోంది. ఏటా నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. రిజర్వేషన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేసేవారు. ఈసారి మాత్రం ఇంకా రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం లేదు. వాస్తవంగా టికెట్​పై 15 నుంచి 20 శాతం అదనంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ తెలంగాణ ఆర్టీసీ ఈ అంశాలపై మౌనంగానే ఉంటోంది. ఈ యేడాది తెలంగాణ ఆర్టీసీ 4940 బస్సులను తిప్పితే వారం రోజుల్లో రూ.94 కోట్ల ఆదాయం రాగా, 2019లో 4100 బస్సులను తిప్పితే రూ.83 కోట్లు సాధించిపెట్టాయి. సంక్రాంతి సమయంలో ఏ రాష్ట్ర ఆర్టీసీ అయినా ఎంతో కొంత అదనపు ధరలు పెంచుతుంటాయి. కానీ ఈసారి తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం లేదు. కేవలం 1800 బస్సులను మాత్రమే తిప్పితే ఆదాయం గణనీయంగా తగ్గుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్​ ఏజెన్సీల ధర దడ..

సంక్రాంతి రవాణాపై తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్​ ట్రావెల్స్​పై ఆధారపడాల్సి వస్తోంది. కాగా, ప్రైవేట్​ ట్రావెల్స్​తో ఒప్పందంతోనే రిజర్వేషన్లు, ఏర్పాట్లు చేయడం లేదనే అపవాదు కూడా టీఎస్​ ఆర్టీసీపై ఉంది. అయితే ప్రైవేట్​ ట్రావెల్స్​ మాత్రం టికెట్లపై నాలుగింతలకుపైగా ధరలు పెంచారు.
* హైదరాబాద్​ నుంచి విజయవాడకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని ఏసీ బస్సులకు రూ.540 వరకు ఉండగా ప్రైవేట్​ ట్రావెల్స్​ మాత్రం రూ.1800 నుంచి రూ.2390 వరకు తీసుకుంటున్నాయి. ముందస్తు రిజర్వేషన్లలో అధికారికంగానే ఈ ధరలు నిర్ణయించారు. ఆరెంజ్​ ట్రావెల్స్​ వంటి సంస్థలు ఒక్క టికెట్​కు రూ.2200 వరకు ధర ఖరారు చేశాయి.
* హైదరాబాద్​ నుంచి విశాఖపట్నంకు ఆర్టీసీ ధర రూ.1023 వరకు ఉండగా సంక్రాంతి సమయంలో ఇంకో రూ.500 వరకు పెంచే అవకాశం ఉంది. కానీ ముందస్తు రిజర్వేషన్లలో భాగంగా ప్రైవేట్​ ట్రావెల్స్​ రూ.5000లను దాటి పోయాయి. ఆరెంజ్​, న్యూ కాళేశ్వరి, టూర్​ వంటి ట్రావెల్స్​ సంస్థలు రిజర్వేషన్ల ఛార్ట్​లో ప్రారంభ ధరనే రూ.5 వేల నుంచి చూపిస్తున్నాయి. వీటికి సంక్రాంతి స్పెషల్​ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు.
* హైదరాబాద్​ నుంచి గుంటూరుకు ఆర్టీసీ ధర రూ.380 నుంచి రూ.408, రూ.580 వరకు ఉండగా ప్రైవేట్​ సర్వీసుల్లో మాత్రం రూ.2 వేలు దాటాయి. కొన్ని బస్సులు రూ.2,450 వరకు వసూలు చేస్తున్నాయి.
* హైదరాబాద్​ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సుల్లో రూ.580 నుంచి రూ.620 వరకు స్పెషల్​ ఛార్జీతో సహా టికెట్​ ధర ఉంటుండగా, ప్రైవేట్​ ట్రావెల్స్​ మాత్రం నాన్​ ఏసీ బస్సుల్లోనే రూ.3 వేలు వసూలు చేస్తున్నాయి. ఏసీ బస్సుల్లో మరో వెయ్యి అదనం.
* హైదరాబాద్​ నుంచి తిరుపతికి తెలంగాణ ఆర్టీసీ రూ.765 నుంచి రూ.1145 వరకు ధర ఉంటే ప్రైవేట్​ ట్రావెల్స్​ మాత్రం సంక్రాంతి స్పెషల్​ ఛార్జీలు కాకుండా జనవరి 5 నుంచి ధరను రూ.3 వేలకు పెంచింది.
* తిరుపతి నుంచి నెల్లూరుకు ఆర్టీసీ ఛార్జీలు రూ.800 వరకు ఉంటుండగా ప్రైవేట్​ బస్సుల్లో మాత్రం రూ.4 వేలకు పెంచాయి. కొన్ని సంస్థలు సంక్రాంతి చార్జీలు అదనంగా చెబుతున్నారు.

ఇంత మేరకు డిమాండ్ ఉంటున్నా ఆర్టీసీ మాత్రం ఇంకా ఖాతా తెరువడం లేదు. కేవలం ప్రైవేట్​ సంస్థలకు లాభం చేసేందుకే ఇలా చేస్తున్నాయంటున్నారు. అయితే ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభం చేస్తే సంక్రాంతి స్పెషల్​ ఛార్జీలు ఎంతో కొంత పెంచినా ధరల భారం ఉండదంటున్నారు. కానీ ఆర్టీసీ మాత్రం ప్రయాణికుల అభిప్రాయాల కంటే ప్రైవేట్​ ట్రావెల్స్​ సహకారానికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నట్లు వ్యవహరిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed