- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రింట్ మీడియాపై ‘కరోనా’ పిడుగు!
దిశ, న్యూస్ బ్యూరో: తెలుగు దినపత్రికల రంగంలో త్వరలో భారీమార్పులు చోటుచేసుకోబోతున్నాయా? కరోనా ఎఫెక్ట్ తో మెయిన్ పేజీల తగ్గింపు, జిల్లా టాబ్లాయిడ్ల ఎత్తివేత తదితర చర్యలు చేబట్టిన ఆయా పత్రికలు లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగించబోతున్నాయా? ప్రింట్ ఆర్డర్ ను, సర్క్యులేషన్ ను వీలైనంత తగ్గించుకుని డిజిటల్ కార్యకలాపాలపైననే ఎక్కువగా కేంద్రీకరించబోతున్నాయా? భారీ సంఖ్యలో సబ్ ఎడిటర్లను, రిపోర్టర్లను, ఇతర విభాగాల సిబ్బందిని రోడ్డున పడేయబోతున్నాయా? ప్రధాన పత్రికలన్నీ కూడబలుక్కున్న తర్వాతే ఈ చర్యలకు పూనుకుంటున్నాయా? అంటే.. అవుననే అంటున్నాయి తెలుగు జర్నలిస్టు వర్గాలు.. కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రధాన దినపత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు తమ జిల్లా టాబ్లాయిడ్లను, ఆదివారం అనుబంధాలను ఎత్తివేసాయి. మెయిన్ లో సైతం పేజీలు తగ్గించాయి. జిల్లాల వార్తలను కూడా మెయిన్ లోనే ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈనాడు, సాక్షి 12 పేజీలతో వస్తుండగా, వెలుగు 14 పేజీలతో, నమస్తే తెలంగాణ 13 పేజీలతో, ఆంధ్రజ్యోతి కేవలం 8 పేజీలతో వెలువడుతున్నాయి. ఇతర పత్రికలన్నీ కూడా జిల్లా టాబ్లాయిడ్లను ఎత్తివేసి 8 నుంచి 12 పేజీలతో మెయిన్ ఎడిషన్ ను వెలువరిస్తున్నాయి. ఇక, ప్రజాపక్షం, ఆంధ్రభూమి తదితర పేపర్లు ఏకంగా ముద్రణనే నిలిపివేసాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, టీవీ చానెళ్లు తమ సిబ్బందికి ‘వర్క్ ఫ్రం హోం’ వెసులుబాటు కల్పించినట్టుగానే, తెలుగు దినపత్రికలు తమ సిబ్బందికి సెలవులతో కూడిన వర్క్ షెడ్యూలును ప్రకటించాయి. టాబ్లాయిడ్లను ఎత్తివేసి మెయిన్ లోనే జిల్లాల వార్తలను ఇస్తున్న నేపథ్యంలో మఫిసిల్, సెంట్రల్ డెస్కుల సిబ్బందికి భారీగా సెలవులు ఇచ్చాయి. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి డ్యూటీకి వచ్చేవిధంగా ఏర్పాట్లుచేసాయి. ప్రింటింగ్, సర్క్యులేషన్, యాడ్స్ విభాగాల వాళ్లు కూడా దాదాపుగా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. మార్చి నెల వేతనాన్ని యథావిధిగా చెల్లించిన ఈ సంస్థలు ఏప్రిల్ నెలలో ఏం చేస్తాయోననే భయాందోళనలు సిబ్బందిలో నెలకొన్నాయి. క్యాజువల్ లీవ్, ఎర్న్ డ్ లీవ్ కింద పరిగణించి పూర్తి నెల జీతాన్ని చెల్లిస్తారా? లేక పని చేసినన్ని రోజులకు మాత్రమే ఇస్తారా? అన్న సందేహాలు వారిలో ఏర్పడ్డాయి. లాక్ డౌన్ మరింతకాలం పొడిగిస్తే తమ పరిస్థతి ఏమిటని దిగులుగా చర్చించుకుంటున్నారు.
కరోనా కేవలం సాకేనా..?
ఇలీవలికాలంలో ప్రింట్ మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. రూ. 15 నుంచి రూ. 20 ఖర్చు చేసి మార్కెట్లోకి తెచ్చిన ఒక పేపర్ కు కేవలం రూ. 2 వరకే తిరిగి వస్తుండడం, ప్రభుత్వ, ప్రైవేటు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ బాగా తగ్గుతుండడం వల్ల ఒకటి రెండు పెద్ద సంస్థలు తప్ప అన్ని మీడియా కంపెనీలు ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు, జనాల్లో దినపత్రికలు ఇళ్లకు తెప్పించుకుని చదివే అలవాటుకు బదులు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఈ-పేపర్ చూసే హాబీ ఈ మధ్య బాగా పెరుగుతోంది. ఈ ధోరణిని గమనించిన ఆయా సంస్థల యాజమాన్యాలు ఇటీవల తమ వెబ్ సైట్లను, డిజిటల్ ఎడిషన్లను బలోపేతం చేయడంతో పాటు, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడానికి వీలుగా మొబైల్ అప్లికేషన్స్ ను డెవలప్ చేస్తున్నాయి. ఇంటర్ నెట్ విభాగంలో పలు మార్పులను తీసుకొచ్చాయి. ఇప్పటిదాకా, తమ పేపర్ ను చదువుమంటూ ఇంటింటికీ చేసే ప్రమోషన్ కేంపెయిన్ ను నిలిపివేసాయి. దాదాపు అన్ని పత్రికలూ ప్రమోటర్ల వ్యవస్థను ఎత్తివేసాయి. ఏడాదికోసారో రెండుసార్లో అట్రాక్టివ్ స్కీంలు ప్రవేశపెట్టే పేపర్లు సైతం ఇప్పుడు వాటి జోలికెళ్లడంలేదు. ఓ ప్రధాన పత్రిక హైదరాబాదులో ముద్రణను అవుట్ సోర్సింగ్ కు ఇచ్చి ఆ విభాగంలోని పలువురి ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. ఇలా ఎవరికి వాళ్లు కాస్ట్ కటింగ్ చర్యలకు పూనుకుంటున్న దశలో కరోనా మూలంగా వచ్చిన లాక్ డౌన్ వారిని ఆదుకున్నదని చెప్పవచ్చు. అప్పటిదాకా వాళ్లు రచించుకున్న వ్యూహాలను కరోనా సాకు చూపించి అమలులోకి తేవడానికి పూనుకున్నారు.
త్వరలో ఉద్యోగాల్లో భారీ కోత..!
లాక్ డౌన్ పేరుతో తాత్కాలికంగా చేపట్టిన చర్యలను శాశ్వతంగా కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పడు ప్రతి మీడియా సంస్థలోనూ తీవ్రస్థాయిలో నడుస్తోంది. ఈ సమయంలోనే మార్కెట్ లీడర్ గా ఉన్న ఓ పత్రిక త్వరలో శాశ్వతంగా జిల్లా టాబ్లాయిడ్లను నిలిపివేయబోతోందన్న ప్రచారం జరగడంతో మిగతా పత్రికలు కూడా వెంటనే ఆ దిశగా సన్నాహాలు ఆరంభించాయి. అన్ని పత్రికల యాజమాన్యాలూ కూడబలుక్కున్న తర్వాతనే ఇలా చేస్తున్నాయన్న వాదన కూడా ఉంది. ఇప్పటివరకు కొత్త జిల్లాల ప్రాతిపదికన తీసుకువస్తున్న టాబ్లాయిడ్లను పాత ఉమ్మడి జిల్లాల వారీగా 16 లేదా 20 కామన్ పేజీలతో తీసుకువస్తే ఎలా ఉంటుందన్నది వాళ్లు చేస్తున్న ఒక ఆలోచన. కొత్త జిల్లాల లోగోతో తెచ్చినా, వాటిలో పేజీలు తగ్గించి (12 లేదా 16) కేవలం ఫస్ట్ పేజీ, బ్యాక్ పేజీని మాత్రం కొత్త జిల్లా వార్తలతో తెచ్చి, మిగతా అన్ని పేజీలూ కామన్ చేస్తే ఎలా ఉంటుందన్నది మరో ఆలోచన. ఈ రెండింటిలో ఏది అమలు చేసినా ఇప్పుడున్న డెస్క్ సిబ్బందిలో సగం కంటే తక్కువే అవసరమవుతారు కనుక మిగతా వాళ్లను ఏం చేయాలన్న ప్రశ్న వారి ముందుకు వచ్చిందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయా పత్రికల యాజమాన్యం వివిధ యూనిట్లలో, డెస్కులలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్ల సంఖ్య, వారిలో ఎవరి నైపుణ్యం ఎంత? ఎవరు పనికి వస్తారు? ఎవరి వేతనం ఎంతుంది? వగైరా వివరాలను సేకరించినట్లు సమాచారం. కొన్ని పత్రికలయితే, జిల్లాల్లో పనిచేస్తున్న సబ్ లలో ఎంత మంది హైదరాబాదుకు రాగలుగుతారు? వంటి విషయాలను తెలుసుకున్నట్లు చెబుతున్నారు. రాలేని పక్షంలో మరో ఉద్యోగం చూసుకొమ్మంటూ సంకేతాలు సైతం ఇచ్చారని అంటున్నారు. టాబ్లాయిడ్లలో పేజీలు తగ్గితే అందుకు తగ్గట్టుగా వార్తలు కూడా తగ్గుతాయి కనుక మండలానికో విలేకరి ఉండడం అవసరమా? నియోజకవర్గానికో రిపోర్టర్ ను ఉంచితే సరిపోదా? అన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఇప్పటికే, ఈనాడు తప్ప మరే పత్రికా మండల కంట్రిబ్యూటర్లకు లైన్ అకౌంటు సరిగ్గా చెల్లించడంలేదు. 6 నెలల నుంచి ఏడాదిన్నర వరకూ పెండింగ్ పెడుతున్నాయి. మధ్యతరహా, చిన్న పత్రికలైతే అసలు లైన్ అకౌంటు జోలికే వెళ్లడంలేదు. సర్క్యులేషన్, యాడ్స్, ప్రింటింగ్ విభాగాలకు సంబంధించి కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతోందని ఆయా పత్రికల్లో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు.
భవిష్యత్తులో టాబ్లాయిడ్ల ఎత్తివేత తప్పదా..?
ఇవన్ని పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో జిల్లా టాబ్లాయిడ్ల ఎత్తివేత తప్పదనిపిస్తున్నదని కొందరు మీడియా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయా పేపర్లు డిజిటల్ కార్యకలాపాలను తగిన స్థాయికి తీసుకెళ్లిన తర్వాత, ఈ పని చేయక తప్పదని వాళ్లంటున్నారు. టాబ్లాయిడ్లు లేకుండా మెయిన్ ఒక్కటి ప్రచురిస్తూ నామమాత్రంగా ప్రింటింగ్ కంటిన్యూ చేస్తూ ప్రధానంగా వెబ్ సైట్, ఈ-పేపర్ పై కేంద్రీకరించడమనే వ్యూహాన్నే అందరూ అనుసరిస్తారని భవిష్యవాణి చెబుతున్నారు. డీఎన్ ఏ అనే ఆంగ్లపత్రిక ముద్రణను పూర్తిగా నిలిపివేసి కేవలం డిజిటల్ ఎడిషన్ కే పరిమితమైన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మీడియాలో ఇదే ధోరణి కోనసాగుతోందని అంటున్నారు. ఇదే జరిగితే, తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు, నాన్-జర్నలిస్టులు రోడ్డున పడడం ఖాయమని ప్రమాదఘంటిక మోగిస్తున్నారు.
Tags: print media, corona, lockdown, eenadu, sakshi, andhra jyothi, namasthe telangana, velugu, printing, journalists, desks, reporters