రేపు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

by Shyam |   ( Updated:2020-08-10 11:09:24.0  )
రేపు తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో మంగళవారం సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రులతో పాటు ప్రధాన కార్యదర్శులు సైతం ఈ సమావేశంలో మంగళవారం పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలు, అన్‌లాక్ అమలవుతున్న తీరు, ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలు, మందుల లభ్యత తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. హోంమంత్రి అమిత్ షా కరోనా కారణంగా కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందడం, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నందున ఆయనకు బదులుగా హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్, రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, జిల్లాస్థాయి ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, గాంధీ ఆసుపత్రిలో లభ్యమవుతున్న సేవలు, హైదరాబాద్ నగరంతో పాటు పక్కనే ఉన్న మేడ్చల్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, కరోనా టెస్టింగ్ జరుగుతున్న తీరు తదితర అంశాలపై కేంద్ర బృందం స్వయంగా పరిశీలించి వైద్యమంత్రి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శితో చర్చించిన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. వీరు అందించే నివేదికలోని కొన్ని అంశాలు కూడా తెలంగాణ సీఎంతో మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed