గత ఆరేళ్ల పురోగతి చరిత్రాత్మకం: మోదీ

by Shamantha N |
గత ఆరేళ్ల పురోగతి చరిత్రాత్మకం: మోదీ
X

న్యూఢిల్లీ: భారత్‌కు 2014-29 కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ పురోభివృద్ధిలో గత ఆరేళ్లు చరిత్రాత్మకమని, మిగతా కాలంలో ఇంకా చేయాల్సినవెన్నో ఉన్నాయని చెప్పారు. యువతకు 16, 17, 18వ ఏళ్ల వయసు ఎంత ముఖ్యమైనదో, యువ ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు 16వ, 17వ, 18వ లోక్‌సభలు అత్యంత కీలకమైనవని తెలిపారు. దేశరాజధానిలో ఎంపీలకోసం నిర్మించిన 76 అంతస్తుల భవనాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు.

16వ లోక్‌సభ(2014-19) దేశంలో చరిత్రగుర్తుపెట్టుకోదగిన అభివృద్ధి జరిగిందని, 17వ లోక్‌సభలోనూ ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టం, సాగు, కార్మిక చట్టాల వంటి నిర్దేశాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. వచ్చే లోక్‌సభ(2024-29) కూడా ఇలాగే కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే 2024-29 కాలంలో భారత్ మరెన్నో కీలక మైలురాళ్లు దాటాల్సి ఉన్నదని, ఆత్మ నిర్భర్ భారత్, ఆర్థిక లక్ష్యాలు, ఇతరత్ర లక్ష్యాలను సాధించుకోవాల్సి ఉన్నదని వివరించారు.

భారత లోక్‌సభల తీరును చరిత్ర మూల్యంకనం చేసినప్పుడు ఈ వ్యవధిని సువర్ణాధ్యాయంగా నిలిపే బాధ్యత తమపై ఉన్నదని అన్నారు. మోడీ సర్కారు రెండో హయాం 2024తో ముగియనున్న సంగతి తెలిసిందే. తర్వాతి జనరల్ ఎలక్షన్స్ 2024లో జరగనున్నాయి. కాగా, మూడో సారి అధికారంలోకి రావడానికి బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 120 రోజులపాటు దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి పర్యటించనున్నారు.

భారత ఆలోచనను ప్రతిఫలిస్తున్నది..

ప్రస్తుత లోక్‌సభ కూర్పు భారత్ కోరుకుంటున్న నూతన ఆలోచనా ధోరణిని ప్రతిఫలింపజేస్తున్నదని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ లోక్‌సభలో మహిళా చట్టసభ్యుల సంఖ్య రికార్డ్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. సుమారు 300 మంది ఎంపీలు కొత్తగా ఎన్నికై లోక్‌సభకు వచ్చారని, 260 మంది ఎంపీలు నూతనంగా ఎన్నికై రాజ్యసభలో అడుగుపెట్టారని వివరించారు. అందువల్లే పార్లమెంటు గణనీయమైన వేగంతో చట్టాలు రూపొందిస్తున్నదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed