నేను కలలో కూడా ఊహించలేదు.. స్వగ్రామంలో రాష్ట్రపతి ఎమోషనల్

by Anukaran |   ( Updated:2021-06-27 12:11:00.0  )
President Ram Nath Kovind
X

లక్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారత అత్యున్నత పదవిని అధిరోహించినప్పటి తర్వాత తొలిసారి యూపీలోని తన స్వగ్రామానికి వెళ్లారు. ఆదివారం ఆయన కాన్పూర్‌ దేహత్ జిల్లా నుంచి స్వగ్రామం పరౌంఖ్‌కు హెలిక్యాప్టర్‌లో వెళ్లారు. అక్కడ నిర్వహించిన స్వాగత కార్యక్రమం జన్ సంబోధన్ సమారోహ్‌లో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఒక మారుమూల పల్లెటూరికి చెందిన నా లాంటి పిల్లాడు దేశ అత్యున్నత పదవిని అధిరోహిస్తాడని కలలో కూడా ఊహించలేదు. కానీ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్ని సుసాధ్యం చేసింది. నేను ఇవాళ పొందిన ఈ పదవికి కారణం నా మాతృభూమి, నా ప్రాంతం, ప్రజల ఆశీస్సులు మాత్రమే. మా కుటుంబ సంప్రదాయం ప్రకారం, ఊరిలోని కురువృద్ధురాలిని అమ్మగా, కురువృద్ధుడిని తండ్రిగా భావిస్తుంటాం. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగడంపై సంతోషపడుతున్నాను.

పరౌంఖ్ కేవలం ఒక గ్రామం కాదు. దేశానికి సేవ చేయాలని ప్రేరణ ఇచ్చిన నా మాతృభూమి. ఆ ప్రేరణే నన్ను హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు, అక్కడి నుంచి రాజ్యసభకు నడిపించింది. రాజ్యసభ నుంచి రాజ్‌భవన్‌కు, అక్కడి నుంచి రాష్ట్రపతి వరకూ తీసుకెళ్లింది. జన్మనిచ్చిన భూమి స్వర్గానికన్నా మిన్న’ అని అన్నారు. యూపీ నుంచి పలువరు ప్రధానులుగా వ్యవహరించి ఉండవచ్చునని, కానీ, తొలిసారిగా యూపీ దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చిందని, తన ద్వారా యూపీ ప్రజలకు రాష్ట్రపతి అయ్యే దారులను తెరిచాయని వివరించారు. అందరూ టీకా వేసుకోవాలని, అందులో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తాను వ్యక్తిగతంగా వారందరికీ రాష్ట్రపతి భవన్‌ను చూపించే ఏర్పాట్లు చేస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed