రాష్ట్రపతి బొల్లారం టూర్​ క్యాన్సిల్​

by Anukaran |
రాష్ట్రపతి బొల్లారం టూర్​ క్యాన్సిల్​
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశ ప్రథమ పౌరుడి హోదాలో రాష్ట్రపతి ప్రతీ ఏడాది శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్ రావడం లేదు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 15 రోజుల పాటు రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నట్లు పర్యటన షెడ్యూలు తొలుత ఖరారైంది. కానీ కరోనా కారణంగా పర్యటనను విరమించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు సందర్శకులను నిలిపివేసినప్పుడే కరోనా బారిన పడ్డారు. భవన్ సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ పర్యటన యథావిధిగా ఉంటే అధికార, రాజకీయ ప్రతినిధులతో భేటీలు, తేనీటి విందు, సందర్శకులతో మాటామంతీ వంటివన్నీ ఉంటాయి కాబట్టి రిస్కు తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ శీతాకాల విడిది వాయిదా పడినట్లు సమాచారం.

ఇప్పటికే ముస్తాబైన రాష్ట్రపతి నిలయం..

రాష్ట్రపతి రాక కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అవసరమైన మరమ్మతు పనులు కూడా పూర్తయ్యాయి. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో రాష్ట్రపతి నిలయానికి అన్ని హంగులు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ లో పనులు మొదలయ్యాయని, నిలయంలో ఏ లోటూ లేకుండా పారిశుధ్యం, భవనాల మరమ్మతు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ప్లంబర్, ఫర్నిచర్, తాగునీరు, రన్నింగ్ వాటర్, పెయింటింగ్‌తో పాటు దట్టంగా ఉండే చెట్ల నరికివేత, పాములు లేకుండా చేయడం వంటి ఏర్పాట్లన్నీ జరిగినట్లు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పది కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తిచేసింది. ఈ నెల 16వ తేదీనే రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం వస్తున్నారన్న అంచనాతో నిలయాన్ని ముస్తాబు చేశారు. కానీ ఆయన పర్యటన వాయిదా పడినట్లు అధికారికంగా ఇంకా సమాచారం రాలేదు. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యటనను వాయిదా వేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ, బొల్లారం అధికార వర్గాల సమాచారం.

ఆనాటి వైస్రాయ్ విడిది… నేటి రాష్ట్రపతి నిలయం..

నిజాంల హయాంలో 1860లో నవాబు నజీరుద్దుల్లా బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నిజాం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇది సైనికాధికారి అధికార నివాసంగా ఉండేది. 1950లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల పర్యటన సమయంలో రాష్ట్రపతికి ఈ నిలయం విడిదిగా ఉపయోగపడేది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో మినీ అటవీ ప్రాంతాన్ని తలపించే రాష్ట్రపతి నిలయంలో ప్రకృతిని ప్రతిబింబించే దట్టమైన చెట్లు, మనసుకు ఉల్లాసం కలిగించే పూల మొక్కలు, సౌందర్యం కోసం గార్డెన్లు ఉన్నాయి. సుమారు ఇరవైకి పైగా గదులున్నాయి. వాటిలో కొన్ని అతిథుల వసతి కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు ఉపయోగపడుతున్నాయి.

నిలయానికి ఏపీజే అబ్దుల్​ కలాం దూరం..

భారత దేశం మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వరకు అందరూ బొల్లారంలోని నిలయానికి శీతాకాల విడిది కోసం వచ్చినవారే. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రం ఆ పదవిలో ఉన్న ఐదేండ్లలో ఒక్కసారి కూడా రాలేదు. శీతాకాలంలో విడిది కోసం వచ్చినా ఇక్కడ ఉండలేదని, హోటల్‌లోనే ఉండి వెళ్లిపోయేవారని రాష్ట్రపతి నిలయం అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయంలో ఉండే 15 రోజుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరమా అని దూరంగా ఉండిపోయినట్లు సమాచారం.

Advertisement

Next Story