పీబీఎల్ ఏడాది పాటు వాయిదా

by vinod kumar |
పీబీఎల్ ఏడాది పాటు వాయిదా
X

దిశ, స్పోర్ట్స్ : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) 6వ సీజన్ డిసెంబర్-జనవరి నెలలో జరగాల్సి ఉండగా.. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ సీజన్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఆరేళ్లుగా ప్రతీ ఏడాది డిసెంబర్-జనవరి నెలల్లో పీబీఎల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఆటగాళ్లు, అభిమానుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం స్పోర్ట్స్‌లైవ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రకటించింది.

‘అంతర్జాతీయ విమాన ప్రయాణాలు డిసెంబర్ 31 వరకు రద్దు చేయడం పీబీఎల్‌పై ప్రభావం చూపింది. రెండు నెలలు వాయిదా వేద్దామనుకున్నా.. ఆసియా ఓపెన్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ జనవరిలో ఉన్నాయి. ఆ తర్వాత ఒలంపిక్స్ కోసం క్రీడాకారులు సన్నద్దం కావల్సి ఉన్నది. అందుకే ఈ సీజన్ పూర్తిగా రద్దు చేసి.. వచ్చే ఏడాది డిసెంబర్‌కు వాయిదా వేశాము’ అని స్పోర్ట్స్‌లైవ్ ఎండీ ప్రసాద్ మంగిపుడి మీడియాకు తెలిపారు. ఆసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్ ద్వారా ఒలంపిక్స్ బెర్తులు ఖరారయ్యే అవకాశం ఉండటం వల్ల ప్రతీ బ్యాడ్మింటన్ ప్లేయర్ వాటిలో తప్పకుండా పాల్గొనాల్సి ఉన్నది.

Advertisement

Next Story