జాతీయ రహదారిపై వలస కూలీ ప్రసవం

by Shyam |   ( Updated:2020-05-05 09:30:00.0  )
జాతీయ రహదారిపై వలస కూలీ ప్రసవం
X

దిశ, మెదక్: జాతీయ రహదారిపై వలస కూలీ ప్రసవించిన హృదయ విదారకరమైన సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు తల్లీబిడ్డను హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లోకేశ్, అనిత దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఏదో ఒక పనిచేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరికి ఉపాధి కరవైంది. ప్రభుత్వం, దాతల సహాయంతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. కేంద్రం లాక్‌డౌన్‌ను మూడోసారి కూడా పొడిగించడంతో పరిస్థితి ఎంతకాలం ఇలాగే ఉంటుందో అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిండు గర్భిని అయిన భార్య అనితను తీసుకుని లోకేశ్ కాలినడకన స్వరాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరారు. దాదాపు 100 కి.మీ.లకు పైగా నడిచి మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామం చేరుకున్నారు. చాలా దూరం నడవడంతో మంగళవారం తెల్లవారుజామున అనితకు నొప్పులు తీవ్రంగా వచ్చాయి. ఆపన్న హస్తం అందించేవారు లేకపోవడంతో 44వ జాతీయ రహదారిపైనే ఆమె ప్రసవించింది. అనితకు ఆడపిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు తల్లీబిడ్డలను రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు ఎస్ఐ రాజేశ్ వెల్లడించారు.

Tags: pregnant lady delivery,on road, medak, lockdown, migrant labour

Advertisement

Next Story

Most Viewed