- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకునేందుకే ఇలా చేస్తున్నారా..!
దిశ, తెలంగాణ బ్యూరో: అరె సత్తీ.. ఈనికి జీతమేమిస్తున్నం రా.. అంటే ఎనిమిది వేలన్నా.., అదే ఎక్కువన్న అని సత్తి అంటే.. ఇంకో రెండేసి రౌండ్ ఫిగర్ చెయ్ రా అని యజమాని అంటడు.. ఆ సినిమాలో హీరోకు జీతం పెంచే ప్రతి సందర్భంలో యజమాని సత్తిని అడగడం, సత్తి ఆ జీతమే ఎక్కువ అని చెప్పడం.. యజమాని (శ్రీహరి) పెంచాలనుకున్నదంతా పెంచడం… ఇది పరిపాటిగా జరుగుతుంది.. ఆ సందర్భంగా సత్తి (సునీల్) ఫీలింగ్ ఏంటంటే ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకన్నా అన్నట్టుగా ఉంటుంది.. ప్రస్తుతం పీఆర్సీ కమిషన్ పరిస్థితి కూడా అంతేలా ఉంది. కమిషన్ సభ్యులు సర్కార్ తోనే నియమించబడి ఏండ్లకేండ్లు స్టడీ చేసి సిఫారసును ప్రభుత్వానికి సమర్పిస్తే పెద్దలు అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ కమిషన్‌ను విలన్ చేయడం, వాళ్లేమో హీరోలు అవడం షరామామూలుగా మారింది.
ఉద్యోగులకు ఏ మేరకు వేతనం పెంచాలో నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ కమిషన్‌ను నియమించగా, అది రెండున్నరేళ్లు కసరత్తు చేసి ఏడున్నర శాతాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం మాత్రం దానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి 30 శాతం ప్రకటించింది. కమిషన్ సిఫారసులకన్నా ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోంది. అంతే ఇంకేముంది ఉద్యోగులు ఆహా ఓహో అంటూ ముఖ్యమంత్రి మీద ప్రశంసలు గుప్పించడం, క్షీరాభిషేకాలు చేయడం చూస్తున్నదే. వేతన సవరణ కమిషన్‌కు విలువలేదని, ఎలాంటి సిఫారసులు చేసినా ప్రభుత్వం అనుకున్నదే చేస్తుందని కొన్నేళ్ల అనుభవం తేటతెల్లం చేస్తోంది.
కమిషన్ సిఫారసులను లెక్కలోకి తీసుకోకపోవడంతో అలాంటి కమిటీలు, కమిషన్లకు విలువ లేదని, ప్రభుత్వం విచక్షణాధికారంతో ఎంతైనా ఇచ్చుకోవచ్చని మరోసారి రూఢీ అయింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనాలు చేసి ఇచ్చిన నివేదిక సైతం కంటితుడుపు చర్యకే పరిమితమైంది. సిఫారసులను పరిగణనలోకి తీసుకోనప్పుడు ఇక కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆ కమిషన్‌లను నియమించడం ఎందుకన్న ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
ఈ కమిషన్‌కు రూ.15 కోట్లు ఖర్చు
వేతన సవరణ ఆలస్యం కావద్దంటూ ముగ్గురు సభ్యులతో వేసిన 11వ పీఆర్సీ కమిషన్‌పై ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెట్టింది. ముగ్గురు సభ్యులకు రూ.లక్షల్లో వేతనాలు ఇచ్చింది. అన్ని సౌకర్యాలు కల్పించింది. సభ్యులు ఇతర రాష్ట్రాలకూ వెళ్లి అధ్యయనం చేసి 7.5 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేశారు. అయితే బిస్వాల్ కమిషన్ స్వతహాగానే ఈ మేరకు సిఫారసు చేసిందా లేక ప్రభుత్వమే ఇప్పించిందా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తోంది. సహజంగానే ఎక్కువ సిఫారసు చేసి తక్కువ ఇచ్చినట్లయితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే తక్కువ సిఫారసు చేయించి ఎక్కువ ఇవ్వడంతో ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ’ ప్రభుత్వం అనే గుర్తింపు పొందగలిగింది. కమిషన్ అధ్యయనంలో ఆర్థిక ఇబ్బందులున్నాయనేది సరైనది కాదా అనే చర్చ మేధావుల్లో మొదలైంది.
గతంలోనూ అంతే..
వేతన సవరణ కమిషన్లు గతంలో ఎలాంటి సిఫారసులు చేసినా ప్రభుత్వాలు మాత్రం పెంపుతోనే నిర్ణయాలే తీసుకున్నాయి. ఒకటీ, రెండు సందర్భాల్లో మినహా మిగిలిన సమయాల్లో కమిషన్ సూచించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాయి.
* 1958, 1965 ఏడాదిల్లో కమిషన్ సూచించిన ఫిట్మెంట్ మేరకే ప్రభుత్వం ఖరారు చేసింది.
* 1974లో రిటైర్డ్ ఐసీఎస్ ఆర్ ప్రసాద్ కమిషన్ 5 శాతం ఫిట్మెంట్ సూచిస్తే ప్రభుత్వం అంతే ప్రకటించింది. కొన్ని ప్రయోజనాలను మాత్రం అదనంగా చేర్చింది.
* 1978లో రిటైర్డ్ ఐఏఎస్ క్రిష్ణస్వామి కమిషన్ మొత్తంగా రెండు శాతం ఇంక్రిమెంట్లను సూచించగా ప్రభుత్వం మాత్రం మూడేండ్ల వరకు ఒక ఇంక్రిమెంట్, 3 నుంచి 7 ఏండ్లకు రెండు ఇంక్రిమెంట్లు, ఏడేండ్ల పై మేరకు మూడు ఇంక్రిమెంట్లను ప్రకటించింది.
* 1985లో ఐఏఎస్ సుబ్రమణ్యం కమిటీ 10 శాతం ఫిట్మెంట్ సూచించగా 10 శాతం ఫిట్మెంట్తో బెనిఫిట్స్ అప్పటి ప్రభుత్వం అదనంగా చెల్లించింది.
* 1991లో రిటైర్డ్ ఐఏఎస్ శంకర్గురు కమిటీ ఎనిమిది శాతం ఫిట్మెంట్ సూచించగా ప్రభుత్వం 10 శాతం ఫిట్మెంట్, మినిమమ్ రూ.100 చొప్పున ప్రకటించింది.
* 1998లో రిటైర్డ్ ఐఏఎస్ ఆర్కేఆర్ గోనెల కమిషన్ 20 శాతం ఫిట్మెంట్ సూచించగా అప్పటి ప్రభుత్వం 25 శాతం ప్రకటించింది.
* 2004లో రిటైర్డ్ ఐఏఎస్ రాంబాబు కమిటీ 10 శాతం ఫిట్మెంట్ సూచిస్తే అప్పటి ప్రభుత్వం 16 శాతం ఇచ్చింది.
* 2008లో రిటైర్డ్ ఐఏఎస్ సీఎస్ రావు కమిషన్ 27 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేస్తే అప్పటి ప్రభుత్వం ఏకంగా 39 శాతం ప్రకటించింది.
* 2013లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ కమిటీ ఫిట్మెంట్ 29 శాతంగా సిఫారసు చేయగా, రాష్ట్రం ఆవిర్భావం, ఉద్యోగుల ఉద్యమ బంధంతో సీఎం కేసీఆర్ ఏకంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు.
ఈసారి కూడా బిశ్వాల్ కమిషన్ కేవలం 7.5 శాతానికి సూచిస్తే సీఎం కేసీఆర్ ఏకంగా 30 శాతం ప్రకటించారు.
ప్రభుత్వాలు తమ క్రెడిట్ కోసమే పీఆర్సీ నివేదికలను పక్కన పెట్టి విచక్షణాధికారంతో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక వ్యూహం ప్రకారమే కమిషన్‌తో తక్కువ ఫిట్మెంట్ సిఫారసు చేయించి, అనంతరం ఉద్యోగ సంఘాలతో చర్చలు పెట్టి, డిమాండ్లు పెట్టి ప్రభుత్వం ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఎల్లకాలం కృతజ్ఞతతో ఉండేలా చేసుకుంటున్నాయి. ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి కూడా అదే వ్యూహం అమలైంది.