సీపీఎల్ ఆడనున్న తొలి భారత క్రికెటర్

by Shyam |
సీపీఎల్ ఆడనున్న తొలి భారత క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక భారత క్రికెటర్ స్థానం సంపాదించాడు. 48ఏళ్ల ప్రవీణ్ తాంబేను ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు ఎంపిక చేసుకుంది. దీంతో సీపీఎల్ ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా అతడు రికార్డు సృష్టించనున్నాడు. తొలుత తాంబే సీపీఎల్ ఆడటంపై వివాదం నెలకొంది. భారతీయ దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటంపై నిషేధం ఉంది. గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన తాంబే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దేశవాళీ ఆడాడు. అయితే, తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు అతను మెయిల్ పంపాడు. దీంతో ఆటకు తాంబే రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఎంసీఏ తెలిపింది. ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయడంతో అతడు సీపీఎల్ ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌‌ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌ టిన్‌బాగో జట్టుకు కూడా కో-ఓనర్‌గా ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్‌ కొత్త సీజన్‌, ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌‌లో మార్పులు చేశారు.

Advertisement

Next Story

Most Viewed