చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

by Harish |   ( Updated:2021-10-03 23:19:18.0  )
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లను వరుసగా ఆరో త్రైమాసికంలో ఎలాంటి మార్పులను చేయడంలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సైతం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు తెలిపింది. గత కొంతకాలంగా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది సురక్షితమైన పథకాల్లో పొదుపు చేయాలని భావిస్తున్నవారు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. గతంతో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కూడా వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. అయితే, ఈ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం గత కొన్ని త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించడంలేదు. తాజాగా, వీటికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పాత వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా అయితే, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసికానికి అంటే మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ వడ్డీ రేట్లను సవరిస్తుంది. అయితే, గడిచిన ఆరు త్రైమాసికాల్లో వీటి వడ్డీ రేట్లను తగ్గించలేదు.

దీర్ఘకాలానికి పెట్టుబడి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ ఉండగా, 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికల కోసం తెచ్చిన ‘సుకన్య సమృద్ధి యోజన్’ ప్రత్యేక పథకంపై 7.6 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ నెలలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష కారణ్నగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించకపోవడం పెట్టుబడిదారులకు ఊరటగా భావించవచ్చు. మరో రెండు వారాల్లో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను సవరించకపోతే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం లేదు. దీనివల్ల ఎక్కువమందికి ప్రయోజనాలు ఉంటాయి. పోస్టాఫీస్ ప‌థ‌కాలు ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ (ఎస్ఎస్‌వై)తో పాటు ఇత‌ర ప‌థ‌కాల్లో సెప్టెంబ‌రు 30, 2021 వ‌ర‌కు ఉన్న వ‌డ్డీ రేట్లనే అక్టోబ‌రు 1-డిసెంబ‌రు 31 వ‌ర‌కు అవే వ‌డ్డీ రేటును పొందనున్నారు.

పీపీఎఫ్, పోస్టాఫీస్, సుకన్య యోజనా లాంటి పథకాల వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలిస్తే..

* ఏడాది కాలానికి పోస్టాఫీస్ పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది.

* 1 ఏడాది నుండి 3 ఏళ్ల వ్యవధికి 5.5 శాతం వడ్డీ రేటు

* 5 ఏళ్ల వ్యవధిపై 6.7 శాతం వడ్డీ రేటు

* 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం వడ్డీ రేటు

* 5 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు

* 5 ఏళ్ల నెలవారీ ఆదాయ ఖాతాపై 6.6 శాతం వడ్డీ రేటు

* 5 ఏళ్ల జాతీయ పొదుపు పత్రాలపై 6.8 శాతం వడ్డీ రేటు

* పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు

* కిసాన్ వికాస్ పత్రాపై 6.9 శాతం వడ్డీ రేటు(124 నెలలు)

* సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ రేటు

Advertisement

Next Story