కరోనాను వ్యాప్తి చేసేందుకేనా.. కేసీఆర్ పర్యటనలు : నిరంజన్

by Shyam |
TPCC-Niranjan
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు మాని.. ప్రజాక్షేమం కోసం కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ సూచించారు. ఆదివారం ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా జిల్లాల బాట మానుకోవాలని, కరోనా థర్డ్ వేవ్ రాకుండా చర్యలు చేపడితే ప్రజలు సంతోషిస్తారన్నారు. కేసీఆర్ జిల్లా పర్యటనలతో రాష్ట్రంలో మరో సారి కరోనా ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిద్దిపేట పర్యటనలో నాయకులు, అధికారులు భౌతిక దూరం పాటించలేదని ఆరోపించారు. సీఎం ప్రసంగిస్తున్నప్పుడు సీఎస్ మాస్కు ధరించలేదని, కొవిడ్ నిబంధనల ప్రకారం ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సలహా ఇచ్చిన వారే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు ప్రజలకేనా? అధికారంలో ఉన్న వారికి పట్టవా? అని అన్నారు. కరోనా హెచ్చరికలను విస్మరించి మున్సిపల్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు నిర్వహించి ఇదివరకే ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

6 లేదా 8 వారాల్లో థర్డ్ వేవ్ రావచ్చనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజల ప్రాణాలను ఫణంగాపెట్టి, లాక్‌డౌన్ ఎత్తి వేసిందన్నారు. ఆర్నెళ్ళలో వచ్చే హుజురాబాద్ ఎన్నికల సమాయాత్తంలో భాగంగా ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని అభివృద్ది భాకాను ఊదడానికే కేసీఆర్ జిల్లా యాత్రల పేరిట ఆర్భాటానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. కరోనా వేళ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు, ఇతర భవనాలను సాదాసీదాగా వాడుకలోకి తేకుండా.. సాధారణంగా ప్రగతి భవన్, ఫాం హౌజ్ దాటని సీఎం దుబారా ఖర్చుతో ఆర్బాటం చేయాల్సిన అవసరం ఉందా? అని, ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

సిద్దిపేటలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాక్ శుద్ధి, చిత్త శుద్ధి, లక్ష్య శుద్ధి కావాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం మాటలు నిజమేనని.. వారి వాక్ శుద్ధి ఏ పాటిదో తాను అన్న మాట మరిచి.. తానే సీఎం అయినప్పుడే తెలిసి పోయిందని, తన చిత్త శుద్ధి, లక్ష్యశుద్ధితో ప్రజాస్వామ్యం ఎలా విలవిల లాడుతుందో.. రాచరికం ఎలా విరాజిల్లుతుందో ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌లో కూడా జరిమానాల పేరిట కోట్లాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేసిన ఈ ప్రభుత్వం చిత్త శుద్ధి అందరికీ తెలిసిన విషయమేనన్నారు.

Advertisement

Next Story

Most Viewed